Telugu Global
National

ప్రతిపక్ష నేత లేని అసెంబ్లీ.. కర్నాటకలో బీజేపీకి వింత సమస్య

కర్నాటకలో ప్రతిపక్ష నేత స్థానం కోసం బీజేపీ ఎవరికోసమో వేచి చూస్తోందని సెటైర్లు పేల్చారు సీఎం సిద్ధరామయ్య. కనీసం బడ్జెట్ సెషన్ లో కూడా ప్రతిపక్ష నేత లేకపోవడం విశేషం అన్నారు

ప్రతిపక్ష నేత లేని అసెంబ్లీ.. కర్నాటకలో బీజేపీకి వింత సమస్య
X

కర్నాటక పరాజయంతో బీజేపీ ఎంతగా కుంగిపోయిందో చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు అవుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఇప్పటికీ అక్కడ ప్రతిపక్ష నేతగా ఎవరినీ ఎంపిక చేసుకోలేదు. రెండు నెలలుగా ప్రతిపక్ష నేత లేకుండానే బీజేపీ నెట్టుకొస్తోంది. ఇప్పటికిప్పుడు ఎవరినైనా ఎంపిక చేయాలన్నా కూడా పరిస్థితులు సహకరించడంలేదు. కుమ్ములాటలు తారా స్థాయికి చేరుకున్నాయి.

కర్నాటక ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కాస్త కంగారు పడగానే.. బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ చీలిపోతుందని, అధికారం తమదేనంటూ కొంతమంది స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. కట్ చేస్తే కాంగ్రెస్ కాపురం సజావుగానే సాగుతోంది. సీఎంగా సిద్ధరామయ్య నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం శివ కుమార్ బలపరిచారు. కానీ బీజేపీలో మాత్రం సయోధ్య కుదర్లేదు. సహజంగా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాల్సి ఉన్నా సాధ్యం కాలేదు. ఆర్.అశోక, బసన్ గౌడ పాటిల్, అరవింద్ బెల్లాడ్.. వర్గాలు బీజేపీని చీలిక పేలికలు చేసేశాయి. దీంతో కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్షానికి నాయకుడే లేకుండా పోయారు.

ఎవరికోసమయినా వేచి చూస్తున్నారా..?

కర్నాటకలో ప్రతిపక్ష నేత స్థానం కోసం బీజేపీ ఎవరికోసమో వేచి చూస్తోందని సెటైర్లు పేల్చారు సీఎం సిద్ధరామయ్య. కనీసం బడ్జెట్ సెషన్ లో కూడా ప్రతిపక్ష నేత లేకపోవడం విశేషం అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రతిపక్షం ఇంత డిఫెన్స్ లో పడిపోవడాన్ని చూడలేదని చెప్పారు. పరోక్షంగా బీజేపీ పరిస్థితిని ఎద్దేవా చేశారు. బీజేపీ మాత్రం ఎన్ని విమర్శలు వస్తున్నా సైలెంట్ గా నే ఉంది. ప్రతిపక్ష నేతను ఎంపిక చేయడానికి మీనమేషాలు లెక్కిస్తోంది.

First Published:  15 July 2023 10:02 AM IST
Next Story