Telugu Global
National

భారత దేశంలో సెల్ ఫోన్ తెలియని గ్రామాలు..

ఇలాంటి గ్రామాలు అత్యథికంగా ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. ఒడిశాలో 6,592 గ్రామాలకు ఇంకా మొబైల్ కవరేజీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో 2,971 గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.

భారత దేశంలో సెల్ ఫోన్ తెలియని గ్రామాలు..
X

ఆ గ్రామాలకు సెల్ ఫోన్ అంటే తెలియదు, ఆ గ్రామాల్లో అస్సలు సెల్ ఫోన్ సిగ్నల్ రాదు, 2G, 3G, 4G, 5G.. ఇలా జనరేషన్లు మారిపోతున్నా ఆ గ్రామాల్లో మాత్రం అసలు సెల్ ఫోన్ వాడే అవకాశమే లేదు. అలాంటి గ్రామాలు భారత్ లో 38,901 వరకు ఉన్నాయి.


కేవలం టవర్లు ఏర్పాటు చేయడం లాభసాటి కాదు అనే కారణంతో ఆయా గ్రామాలకు సెల్ ఫోన్ సిగ్నల్ ఇవ్వలేని పరిస్థితి. మొబైల్‌ కవరేజ్‌ లేని గ్రామాల వివరాలను కేంద్ర కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌ లో వెల్లడించింది. వాణిజ్యపరంగా అది సాధ్యం కాకపోవడంతోపాటు జనాభా అక్కడక్కడ కొద్దికొద్దిగా ఉండడమే దీనికి కారణమని తెలిపింది కేంద్ర కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ.

దేశంలో మొత్తం గ్రామాల సంఖ్య 6,44,131

మొబైల్ కనెక్టివిటీ ఉన్న గ్రామాలు 6,05,230

మొబైల్‌ కవరేజ్‌ ఏమాత్రం లేని గ్రామాలు 38,901

ఇలాంటి గ్రామాలు అత్యథికంగా ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. ఒడిశాలో 6,592 గ్రామాలకు ఇంకా మొబైల్ కవరేజీ లేదు. ఆ తర్వాత రాజస్థాన్‌లో 3,316 గ్రామాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,121 గ్రామాలు, మధ్యప్రదేశ్ లో 3,092 గ్రామాలు, అరుణాచల్ ప్రదేశ్ లో 3,081 గ్రామాలు, ఆంధ్రప్రదేశ్ లో 2,971 గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.

కేంద్రం ఏం చేస్తోంది..?

దేశవ్యాప్తంగా మొబైల్‌ కవరేజీ లేని గ్రామాల్లో 4G మొబైల్‌ సేవలను దశల వారీగా కల్పించడానికి కేంద్రం రూ.26,316 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ రూపొందించినట్టు కేంద్ర కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో దశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.2,211 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 2G టెక్నాలజీని రూ.2,425 కోట్ల అంచనా వ్యయంతో 4G టెక్నాలజీ స్థాయికి పెంచబోతున్నట్టు పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను అందించడానికి రూ.3,673 కోట్ల వ్యయం అంచనాతో పథకాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.

First Published:  23 Feb 2023 1:47 PM IST
Next Story