Telugu Global
National

స్వీయ నిబంధనలు పాటిస్తే.. అడ్డుకోవచ్చు.. – కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై వైద్యుల వెల్లడి

హైదరాబాద్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ కార్తీక్‌ వేదుల కొత్త వేరియంట్‌పై స్పందిస్తూ.. జేఎన్‌.1 ఉపరకం ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని బీఏ. 2.8.6 శాఖకు చెందినదని తెలిపారు.

స్వీయ నిబంధనలు పాటిస్తే.. అడ్డుకోవచ్చు.. – కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై వైద్యుల వెల్లడి
X

దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ మరోసారి వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరోపక్క కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఈ ఉపరకంపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని సీనియర్‌ ప్రజారోగ్య వైద్య నిపుణుడు డాక్టర్‌ చంద్రకాంత్‌ లహారియా తెలిపారు. ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు, శ్వాసకోశ సంబంధిత వైరస్‌లు తరచుగా రూపాంతరం చెందుతుంటాయని వివరించారు.

మన దేశ ప్రజలు ఇప్పటికే కరోనా ఉపరకం వైరస్‌లను ఎదుర్కొన్నారని, చాలా మంది రెండు డోసుల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ను తీసుకున్నారని చెప్పారు. కాబట్టి, కొత్తగా వెలుగు చూసిన ఉపరకంతో ఆందోళన చెందాల్సిన రీతిలో ముప్పు ఉండదని తెలిపారు. అయితే అప్రమత్తంగా ఉండటం అవసరమని చెప్పారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం వంటి చర్యల ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.



హైదరాబాద్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ కార్తీక్‌ వేదుల కొత్త వేరియంట్‌పై స్పందిస్తూ.. జేఎన్‌.1 ఉపరకం ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని బీఏ. 2.8.6 శాఖకు చెందినదని తెలిపారు. ఇది మనిషి రోగనిరోధక వ్యవస్థను అధిగమిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయని చెప్పారు. అయితే, ఇప్పటి వరకు జేఎన్‌.1 సోకిన వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు ఎలాంటి సమాచారం లేదన్నారు. దీని గురించి ఆందోళన అవసరం లేదని చెప్పారు.

అలాగే వైరాలజీ ప్రొఫెసర్‌ దీపక్‌ సెహగల్‌ మాట్లాడుతూ.. కొత్త ఉప రకానికి చెందిన ప్రధాన వేరియంట్‌లో 35 అమినో యాసిడ్‌ పరివర్తనాలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒక దాని సాయంతో వైరస్‌ మనిషి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావం అధికంగా ఉంటుందనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేశారు. గత వైరస్‌ల లక్షణాలే ఇందులోనూ ఉన్నాయని తెలిపారు. ఆందోళన చెందకుండా ప్రజారోగ్య వ్యవస్థను, ప్రజలను అప్రమత్తం చేసి, స్వీయ నిబంధనలు పాటిస్తే.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు.

First Published:  22 Dec 2023 9:14 AM IST
Next Story