అభ్యర్థులు చరాస్తుల వివరాలన్నీ చెప్పక్కర్లేదు.. సుప్రీంకోర్టు క్లారిటీ
అత్యంత విలువైన ఆస్తులుండి, విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తే తప్ప అభ్యర్థి తన ప్రతి చరాస్తి వివరాన్ని ప్రకటించాల్సిన పనిలేదని సుప్రీం పేర్కొంది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రతి చరాస్తి వివరాన్ని కచ్చితంగా చెప్పాలన్న రూలేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ సమాచారం తెలుసుకోవడం ఓటరు కచ్చితమైన హక్కేమీ కాదని కామెంట్ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తేజు ప్రాంతం నుంచి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కరిఖో ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఈ క్లారిటీ ఇచ్చింది.
కరిఖో తన నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో తన భార్య, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మూడు వాహనాల వివరాలు వెల్లడించలేదని ఆయన ప్రత్యర్థి కోర్టులో కేసు వేశారు. చరాస్తుల వివరాలు దాచిపెట్టినందుకు ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీన్ని గువాహటి హైకోర్టు సమ్మతించి కరిఖో ఎన్నికను రద్దు చేసింది. ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. చరాస్తుల వివరాలన్నీ వెల్లడించకపోవడం తప్పు కాదని.. అభ్యర్థి ప్రతి చరాస్తి వివరాన్ని కచ్చితంగా చెప్పాలని నిబంధనేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
అత్యంత విలువైన ఆస్తులుండి, విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తే తప్ప అభ్యర్థి తన ప్రతి చరాస్తి వివరాన్ని ప్రకటించాల్సిన పనిలేదని సుప్రీం పేర్కొంది. తన అభ్యర్థిత్వానికి సంబంధించిన విషయాలు తప్ప మిగిలిన విషయాల్లో ప్రైవసీ పాటించేందుకు అభ్యర్థికి హక్కు ఉందని స్పష్టం చేసింది.