Telugu Global
National

టోల్ కోసం ఇక ఆగ‌క్క‌ర్లేదు.. త్వ‌ర‌లో అమ‌లులోకి కొత్త విధానం

ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ (FASTag) విధానం స్థానంలో అడ్డంకులు లేని టోల్ వ్యవస్థ లేదా ఓపెన్ టోల్ సిస్టమ్ అమలుకు సంబంధించిన ట్రయల్స్ కొనసాగుతున్నాయని కేంద్ర‌మంత్రి తెలిపారు.

టోల్ కోసం ఇక ఆగ‌క్క‌ర్లేదు.. త్వ‌ర‌లో అమ‌లులోకి కొత్త విధానం
X

వాహ‌న‌దారులు ఇక‌పై టోల్ ప్లాజాల వ‌ద్ద ఆగాల్సిన అవ‌స‌రం లేకుండా త్వ‌ర‌లో కొత్త విధానం అమ‌లులోకి రానుంది. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ విధానం అమ‌లులోకి వ‌స్తే దేశంలోని జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణికులు ఇక‌పై టోల్ ప్లాజాల వ‌ద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ బుధ‌వారం ఢిల్లీలో ఈ విష‌యం వెల్ల‌డించారు.

ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ (FASTag) విధానం స్థానంలో అడ్డంకులు లేని టోల్ వ్యవస్థ లేదా ఓపెన్ టోల్ సిస్టమ్ అమలుకు సంబంధించిన ట్రయల్స్ కొనసాగుతున్నాయని కేంద్ర‌మంత్రి తెలిపారు. ఇది విజయవంతం కాగానే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా వాహ‌న‌దారుల ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. టోల్ చెల్లింపులు కిలోమీట‌ర్ల ఆధారంగా చేయొచ్చ‌ని తెలిపారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్టాగ్ విధానంతో టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించగలిగామని.. ఆ సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర‌మంత్రి చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్ వ్యవస్థను ప్రస్తుతం ఢిల్లీ-మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ హైవేలో పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నట్టు చెప్పారు. వీటివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతో పాటు, ప్రయాణించిన దూరానికే ఫీజు వసూలు చేయడం వీలుపడుతుందన్నారు.

First Published:  2 Aug 2023 8:22 PM IST
Next Story