నో మాస్క్.. నో ప్రాబ్లమ్. అన్నిచోట్లా నిబంధనలు సడలింపు
ఇకపై విమానాశ్రయాల్లోనూ, విమాన ప్రయాణాల్లోనూ మాస్క్ తప్పనిసరి కాదు. కానీ, మాస్క్ ధరించడం మాత్రం ఉత్తమం అది మీ ఆరోగ్యానికే మంచిది అంటూ కేంద్రం చిన్న సందేశం ఇస్తోంది.
నో మాస్క్, నో ఎంట్రీ అనే పరిస్థితి నుంచి నో మాస్క్, నో ప్రాబ్లమ్ అనే వరకు వచ్చేశాం. ఇప్పటికే దాదాపుగా అన్నిచోట్లా మాస్క్ నిబంధనలు తీసేశారు. ఇప్పటి వరకూ విమాన ప్రయాణికులపై మాత్రమే ఈ కండిషన్ ఉంది. కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలతో అవి కూడా రద్దయ్యాయి. ఇకపై విమానాశ్రయాల్లోనూ, విమాన ప్రయాణాల్లోనూ మాస్క్ తప్పనిసరి కాదు. కానీ మాస్క్ ధరించడం మాత్రం ఉత్తమం అది మీ ఆరోగ్యానికే మంచిది అంటూ కేంద్రం చిన్న సందేశం ఇస్తోంది.
దేశంలో కరోనా కేసులు, రికవరీలు, అందుబాటులో ఉన్న బెడ్లు.. అంటూ రోజువారీ గణాంకాలు విడుదలవుతూనే ఉన్నా కరోనా గురించి పట్టించుకునేవారు లేరు. జలుబు, దగ్గుతోపాటు కరోనా లక్షణాలున్నా కూడా సాధారణ మందులు వాడి సరిపెట్టుకుంటున్నారు. గతంలో లాగా తీవ్రంగా ఇబ్బందిపడేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అయితే కరోనా తుడిచిపెట్టుకుపోయిందని మాత్రం చెప్పలేం, ఎందుకంటే ఒకటీ అరా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ కరోనా వైరస్ తో వచ్చిన ఇబ్బందేమీ లేదని, అది సాధారణ ఫ్లూ లాగా మారిపోయిందని, దాన్ని తట్టుకునే స్థితికి భారతీయుల్లో రోగనిరోధకత పెరిగిందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అందుకే ఇప్పుడు మాస్క్ నిబంధన, శానిటైజర్ నిబంధన, మనిషికి మనిషికి దూరం ఉండాలనే నిబంధన, గుంపులుగా చేరకూడదనే నిబంధనలన్నీ ఎత్తివేసింది ప్రభుత్వం. చివరిగా విమాన ప్రయాణాల్లో కూడా ఈ నిబంధనలేవీ ఉండవని తేల్చి చెప్పింది కేంద్రం. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 0.02 శాతం మాత్రమే. రికవరీ రేటు 98.79 శాతానికి పెరిగింది.
మాస్క్ ఎప్పటికీ మంచిదే..
గతంలో మాస్క్ లేకపోతే జరిమానా వేసేవారు, గుంపులుగా చేరితే పోలీసులు చెదరగొట్టేవారు, లాఠీ చార్జ్ లు, అరెస్ట్ లు, అబ్బో.. చాలానే జరిగాయి. కానీ ఇప్పుడు పూర్తిగా మాస్క్ నిబంధనే ఎత్తివేయాల్సిన పరిస్థితికి చేరుకున్నాం. అయితే మాస్క్ తప్పనిసరి కాదు అని ప్రభుత్వం చెప్పినా, జరిమానా లేదు అనే ధీమా ఉన్నా.. ఎవరి స్వీయ జాగ్రత్తల్లో వారు ఉండటం మేలు అని వైద్యులు సూచిస్తున్నారు. జన సమూహంలోకి వెళ్లే సమయంలో మాస్క్ ఎప్పటికీ మంచిదేనంటున్నారు.