Telugu Global
National

అవిశ్వాసంపై చర్చ.. అందరి వేళ్లూ మోదీవైపే

మణిపూర్ కి న్యాయం చేసేందుకే పార్లమెంట్ లో చర్చ మొదలు పెట్టామన్నారు ఎంపీ గౌరవ్. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ గురించి మాట్లాడితే డబుల్ ఇంజిన్ ఫెయిలైందని మోదీ ఒప్పుకోవాల్సి వస్తుందని, అందుకే ఆయన వెనక్కి తగ్గారని విమర్శించారు.

అవిశ్వాసంపై చర్చ.. అందరి వేళ్లూ మోదీవైపే
X

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ వాడివేడిగా జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చ మొదలు కాగా.. మొత్తం 16 గంటలసేపు చర్చ కొనసాగేలా స్పీకర్ టైమ్ కేటాయించారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ తో సభ్యత్వం తిరిగి రావడంతో, రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఈ చర్చను రాహుల్ స్వయంగా మొదలు పెడతారనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో రాహుల్ బదులు, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చ ప్రారంభించడంతో బీజేపీ నుంచి సెటైర్లు మొదలయ్యాయి.

డబుల్ ఇంజిన్.. ట్రబుల్ ఇంజిన్..

మణిపూర్ కి న్యాయం చేసేందుకే పార్లమెంట్ లో చర్చ మొదలు పెట్టామన్నారు ఎంపీ గౌరవ్. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ గురించి మాట్లాడితే డబుల్ ఇంజిన్ ఫెయిలైందని మోదీ ఒప్పుకోవాల్సి వస్తుందని, అందుకే ఆయన వెనక్కి తగ్గారని విమర్శించారు. మణిపూర్ లో ఇంకా ఇంటర్నెట్ పునరుద్ధరించలేదని, పిల్లల చదువులు ఆగిపోయాయని, ఆడపిల్లలు రోడ్లపైకి రాలేకపోతున్నారని, పోలీస్ స్టేషన్లు లూటీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గౌరవ్. మణిపూర్ లో 150మంది చనిపోయారని, 6500 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, 60వేలమంది నిరాశ్రయులయ్యారని, 5వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయని గణాంకాలతో సహా వివరించారాయన. ఇంత జరుగుతున్నా గొడవలు మొదలైన 80రోజుల తర్వాత మోదీ కేవలం 30 సెకన్లపాటు మాత్రమే మాట్లాడారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.


మౌనమే సమాధానమా..?

- చైనా విషయంలో మౌనం..

- ఢిల్లీ అల్లర్ల సమయంలో మౌనం..

- రెజర్ల ఆందోళన విషయంలోనూ మౌనం..

- రైతు ఆందోళన విషయంలోనూ మౌనం..

- అదానీ విషయంలోనూ మౌనం..

అన్నిట్లో మోదీ మౌనం దేనికి అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు.

మణిపూర్‌ సీఎం రాజీనామా చేయాలి..?

మణిపూర్‌ లో 10 వేల అల్లర్లు, హత్యలు, అత్యాచార కేసులు నమోదయ్యాయని అవిశ్వాసంపై జరిగిన చర్చలో చెప్పారు ఎంపీ సుప్రియా సూలే. అయినా కూడా కేంద్రంలో చలనం లేదని ఎద్దేవా చేశారామె. మణిపూర్‌ సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్‌ కు వచ్చేందుకు మోదీకి అభ్యంత‌రం ఏంటని ప్రశ్నించారు డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు. మ‌ణిపూర్‌ లో శాంతిభ‌ద్ర‌త‌లకు విఘాతం కలిగితే.. ఐరోపా, యూకే ఆందోళ‌న వ్య‌క్తం చేశాయని, అయినా మోదీ స‌ర్కార్ మౌనం దాల్చిందని అన్నారు. దేశంలో నెల‌కొన్న ప‌రిస్ధితిలాగే మ‌ణిపూర్‌ లో కూడా మెజారిటీ వ‌ర్సెస్ మైనారిటీ అన్న‌ట్టుగా ప‌రిస్ధితులు నెల‌కొన్నాయని విమర్శించారు.

టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా మణిపూర్ అల్లర్లు-మోదీ మౌనంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ లో ఏ చిన్న గొడవ జరిగినా, కేంద్రం ఓ బృందాన్ని పంపిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తుందని, మరి మణిపూర్ రాష్ట్రం తగలబడిపోతున్నా ఇప్పటి వరకు ఎందుకు చలించలేదని ప్రశ్నించారు సౌగత్ రాయ్. భారత్ ని ప్రేమించేవారెవరైనా మోదీని ద్వేషిస్తారని చెప్పారు.

First Published:  8 Aug 2023 11:25 AM GMT
Next Story