Telugu Global
National

నూపుర్ శర్మ కేసు: మొన్న ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జీలే నేడు ఊరటనిచ్చారు

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కిన బీజేపీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఆమెను అరెస్టు చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నూపుర్ శర్మ కేసు: మొన్న ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జీలే నేడు ఊరటనిచ్చారు
X

తన వ్యాఖ్యలతో దేశంలో పెను వివాదం రేపిన బీజేపీ మాజీ అధికారప్రతినిధి నూపుర్ శర్మకు సుప్రీంకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. మహమ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్ కి గాను నూపుర్ పై దాఖలైన కేసుల్లో ఆమెను అరెస్టు చేయరాదని కోర్టు మంగళవారం ఆదేశించింది. తనమీద పెట్టిన అన్ని ఎఫ్ ఐ ఆర్ లను ఒకటిగా క్లబ్ చేయాలన్న ఆమె అభ్యర్థనకు స్పందించాలని వివిధ రాష్ట్రాలకు సూచించింది. తనపై పెట్టిన అన్ని (9) కేసులను కలిపి ఒక్కటిగా మార్చాలన్న ఆమె విజ్ఞప్తిపై కోర్టు ఆగస్టు 10 న విచారణ జరపనుంది. మొత్తం 8 రాష్ట్రాల్లో నూపుర్ శర్మపై కేసులు దాఖలై ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఇక తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అసోం రాష్ట్రాలు స్పందించాల్సి ఉంది. నూపుర్ పై బలవంతపు చర్యలేవీ తీసుకోరాదని, భవిష్యత్తులో ఆమె మీద నమోదు చేసే ఏ ఫిర్యాదు లేదా ఏ ఎఫ్ ఐ ఆర్ కైనా ఈ ఆదేశం వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. తన క్లయింటు నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని, ఆమెకు తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని ఆమె తరఫు అడ్వొకేట్ మనీందర్ సింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. నూపుర్ ని హతమారుస్తామంటూ బీహార్ వంటి వివిధ రాష్ట్రాల్లో పలువురు బెదిరించారని, ఆమె పట్ల దారుణ వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలాతో కూడిన బెంచ్.. ఈ పిటిషన్ ను విచారిస్తూ.. నూపుర్ ని చంపేయాలన్న సల్మాన్ చిస్తీ బెదిరింపులను పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఆమె తల నరకాలంటూ యూపీకి చెందిన ఓ వ్యక్తి చేసిన బెదిరింపును కూడా న్యాయమూర్తులు పరిశీలనలోకి తీసుకున్నారు. పిటిషనర్ (నూపుర్) పై ఏయే రాష్టాల్లో కేసులు నమోదయ్యాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు .. ఆమెకు సెక్యూరిటీ కల్పించే విధివిధానాలను అన్వేషించాలి.. అలాగే కేంద్రం కూడా దీనిపై దృష్టి పెట్టాలి అంటూ.. వీటికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

తను అరెస్టు కాకుండా స్టే ఇవ్వాలని, భద్రత కల్పించాలని నూపుర్ శర్మ తన పిటిషన్ లో కోరింది. ఈ నెల 1 న కోర్టు తనపై చేసిన తీవ్ర వ్యాఖ్యల తరువాత తనను మానభంగం చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆమె ఈ పిటిషన్ లో పేర్కొంది. కాగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలాతో కూడిన వెకేషన్ బెంచ్ నాడు చేసిన వ్యాఖ్యల అనంతరం ఆమె తన పిటిషన్ ను ఉపసంహరించుకుంది. 'నీ లూజ్ టంగ్ కారణంగా దేశమంతా ఇప్పడు అగ్గి రాజుకుంది' అని ఆ నాడు బెంచ్ తీవ్రంగా నూపుర్ ని మందలించింది. దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఘటనలకన్నింటికీ పూర్తిగా నువ్వే కారణమని వ్యాఖ్యానించింది. పైగా... తనపై అనేక రాష్ట్రాల్లో దాఖలైన కేసులనన్నింటినీ ఒకటిగా క్లబ్ చేసి ఢిల్లీకి బదలాయించాలన్న ఆమె అభ్యర్థనను కూడా నాడు బెంచ్ తిరస్కరించింది.

మరోవైపు- ఈ ఇద్దరు న్యాయమూర్తులు వాడిన పదజాలాన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో వీరిని అనేకమంది టార్గెట్ చేశారు. లూజ్ టంగ్ వంటి పదాలను న్యాయమూర్తులు వాడడంలో ఔచిత్యం ఉందా అని పలువురు ప్రశ్నించారు. ఆ తరువాత ఓ ఈవెంట్ కి జస్టిస్ పార్దీవాలా హాజరైన సందర్భంలో ... జడ్జీలపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రమాదకరమైన ట్రెండ్ కి దారి తీస్తుందని, చట్టం నిజంగా ఏం చెబుతోందో అనే దానికన్నా మీడియా ఏమాలోచిస్తుందో అన్నదానిపైనే న్యాయమూర్తులు దృష్టి పెట్టాల్సివస్తోందని ఆయన పేర్కొన్నారు. సోషల్, డిజిటల్ మీడియాలు... జడ్జీలు ఇచ్చే తీర్పులపై నిర్మాణాత్మక, విమర్శనాత్మక పరిశీలన చేయాలని కూడా ఆయన సూచించారు.

First Published:  19 July 2022 12:07 PM GMT
Next Story