Telugu Global
National

సివిల్స్‌లో వ‌యోప‌రిమితి స‌డ‌లింపుపై కేంద్రం నో

సివిల్స్ ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్ష‌ల‌కు తేదీల‌ను నిర్ణ‌యించ‌డంతో పాటు ప‌రీక్ష కేంద్రాల‌ను కూడా యూపీఎస్‌సీనే నిర్ణ‌యిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి జితేంద్ర సింగ్ గుర్తుచేశారు.

సివిల్స్‌లో వ‌యోప‌రిమితి స‌డ‌లింపుపై కేంద్రం నో
X

సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌కు వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు సాధ్యం కాద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపికకు నిర్వహించే ఈ ప‌రీక్ష‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులూ ఉండవని తేల్చి చెప్పింది. కరోనా మహమ్మారి, ఆ తర్వాత విధించిన లాక్ డౌన్ కారణంగా ఒక ఏడాది కోల్పోయిన అభ్యర్థులకు వయో సడలింపు ఇచ్చే ప్రతిపాదన ఉందా.. అంటూ కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ప్రయత్నాల సంఖ్య, వయో పరిమితికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధ‌న‌ల్లో మార్పులు చేయ‌డం సాధ్యం కాదని మంత్రి జితేంద్ర సింగ్‌ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నిబంధనలకు అనుగుణంగానే సివిల్ సర్వీసెస్ ప‌రీక్ష‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏటా నిర్వహిస్తుందని కేంద్ర‌మంత్రి తెలిపారు. కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, డిపార్ట్‌మెంట్‌ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయాల‌ను సిబ్బంది, శిక్ష‌ణ విభాగం ప‌రిశీలించిన‌ట్టు వివ‌రించారు. అయితే సివిల్స్ ప‌రీక్ష‌కు సంబంధించి వ‌యో ప‌రిమితి విష‌యంలో ఇప్ప‌టికే ఉన్న నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డానికి వీలుప‌డ‌టం లేద‌ని తెలిపారు.

సివిల్స్ ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్ష‌ల‌కు తేదీల‌ను నిర్ణ‌యించ‌డంతో పాటు ప‌రీక్ష కేంద్రాల‌ను కూడా యూపీఎస్‌సీనే నిర్ణ‌యిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. సివిల్స్ ప్రిలిమ్స్ 2023 ప‌రీక్ష మే 28న జ‌ర‌గ‌గా, జూన్ 12న ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయ‌ని వివ‌రించారు. ఈ ప‌రీక్ష‌లో 14,624 మంది అర్హ‌త సాధించార‌ని, ఫెయిలైన కొంద‌రు అభ్య‌ర్థులు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించార‌ని తెలిపారు.

First Published:  11 Aug 2023 8:06 AM IST
Next Story