నితీశ్ కుమార్ రికార్డు..ఎమ్మెల్యే కాకుండానే 8సార్లు సీఎం!
బిహార్ లో రాజకీయ పరిణామాల నేపద్యంలో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ సాయంత్రం ఆయన ఆర్జెడి మద్దతుతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు
బిహార్ లో రాజకీయ పరిణామాల నేపద్యంలో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ సాయంత్రం ఆయన ఆర్జెడి మద్దతుతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఇప్పటి వరకు ఏడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినా ఎమ్మెల్యేగా మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేదు. విధాన మండలి సభ్యునిగానే ఎన్నికవుతూ నేరుగా సీఎం పీఠం ఎక్కుతున్నారు. అందుకే ఆయన ప్రత్యర్ధులు ఎప్పుడూ అసెంబ్లీకి పోటీ చేయని ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేస్తుంటారు. అయినా ఆయన ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు.
ఇంతకుముందు, నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఏడుసార్లు ప్రమాణం చేశారు.. చాలా సందర్భాలలో, అంతర్గత విభేదాలు పొత్తులు విచ్ఛిన్నమైన కారణంగా ప్రభుత్వం పడిపోయేది. ఈసారి కూడా నితీశ్ కుమార్ బిజెపితో తెగదెంపులు చేసుకోవడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆర్జెడీ, కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో ఎనిమిదవ సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నితీష్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో మొదటిసారిగా మార్చి 3, 2000న బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమవడంతో 7 రోజులు పాటే పదవిలో ఉన్న నితీష్ రాజీనామా చేశారు.
2005లో జెడి(యు) , బిజెపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు గెలుచుకున్నప్పుడు కుమార్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడుగా ఆయన ఈ సారి తన 5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేశారు.
దీని తర్వాత కూడా 2010లో బీజేపీతో పొత్తు కొనసాగించి మరోసారి సీఎంగా ఎన్నికయ్యారు. అయితే, 2014లో నరేంద్ర మోడీ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అవతరించడంతో కినుక వహించిన కుమార్ పదవినుంచి వైదొలిగారు. అప్పుడు జితన్ రాం మాఝీ ఆ బాధ్యతలు చేపట్టారు. తొమ్మిది నెలల తర్వాత నితీష్ కుమార్ తిరిగి సీఎం పదవిలోకి వచ్చారు, తాను పదవి నుండి వైదొలగి "తప్పు చేశాను" అని ఆ సందర్భంలో అన్నారు. మాంఝీ పదవినుంచి దిగడానికి ఇష్టపడకపోవడంతో ఆయన్ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ నుంచి బహిష్కరించడంతో నితీష్ కు మార్గం సుగమం అయింది.
బీహార్‌లో 2015 ఎన్నికలలో నితీష్ కుమార్ ఆర్జెడీ ,కాంగ్రెస్ పార్టీలతో జతకట్టి మంచి పలితాలు పొందారు. ఆ తర్వాత నితీష్ సీఎంగాను, ఆర్జెడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం గాను ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జెడీ నేతలపై ఆరోపణలు రావడంతో
2017లో జేడీయూ-ఆర్జేడీ కూటమి నుంచి వైదొలిగిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత బిజెపితో చేతులు కలిపి కొత్త కూటమిగా ఏర్పడ్డారు. బిజెపి మద్దతుతో ఆరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
2020 ఎన్నికల్లో మరోసారి గెలిచి నితీష్ కుమార్ ఏడోసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు, బిజెపి తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తోందన్న అనుమానాలతో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని పదవికి రాజీనామా చేశారు. మరోసారి పాత మిత్ర పక్షాలు ఆర్జెడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్నిఏర్పాటు చేయనున్నారు. ఈ సాయంత్రం నితీష్ ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన శాసన మండలినుంచే ఎన్నికవుతూ వచ్చారు. 2018లో నితీష్ శాసనమండలికి ఎంపికయ్యారు. 2024లో ఆయన ఎమ్మెల్సీ పదవి ముగియనుంది.