బీజేపీని ఓడించి హిందూ - ముస్లిం ఐక్యతను పునః ప్రతిష్టిస్తాం.. - నితీష్ కుమార్
బీజేపీ దేశంలో మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని నితీష్ ఆరోపించారు. వరుసగా మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ కుతంత్రాలను మేం తిప్పి కొడతామన్నారు.
బీజేపీని ఓడించి దేశంలో హిందూ - ముస్లిం ఐక్యతను పునః ప్రతిష్టిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. బుధవారం ఆయన ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ తో కలసి రాంచీకి వచ్చారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడం, సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేయడంపై సోరెన్ తో చర్చించినట్లు చెప్పారు. ఈ చర్చల ఫలితం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనిపిస్తుందన్నారు.
బీజేపీ దేశంలో మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని నితీష్ ఆరోపించారు. వరుసగా మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ కుతంత్రాలను మేం తిప్పి కొడతామన్నారు. బీజేపీని ఓడించి దేశంలో హిందూ-ముస్లిం ఐక్యతను పునః ప్రతిష్టిస్తామని నితీష్ కుమార్ పేర్కొన్నారు.
కొన్ని నెలలుగా నితీష్ కుమార్ ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ విపక్ష పార్టీల అధినేతలతో వరుసగా భేటీలు జరుపుతున్నారు. మంగళవారం ఒడిశాకు వెళ్లిన నితీష్ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ తో చర్చలు జరిపారు. ఇక ఇప్పటికే నితీష్ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఢిల్లీ, ఒడిశా ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ తదితరులను కలసి చర్చలు జరిపారు.