Telugu Global
National

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలసి మహాకూటమి దిశగా నితీశ్, లాలూ పావులు?

బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే మహాకూటమి పేరుతో ఆ రాష్ట్రంలో జట్టు కట్టారు. వీరిద్దరూ ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలువనున్నారు. ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ సోనియాతో భేటీ కానుండటం విశేషం.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలసి మహాకూటమి దిశగా నితీశ్, లాలూ పావులు?
X

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను ఎలాగైనా గద్దె దించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయి. ఒంటరిగా బీజేపీపై యుద్దం చేయడం వల్ల ఒరిగేది శూన్యమని.. బీజేపీయేతర శక్తులన్నీ ఒకతాటిపైకి వస్తేనే ఎదుర్కోగలమనే నిర్ణయానికి రాబోతున్నాయి. ఈ క్రమంలో మహాకూటమిని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఈ కూటమిని ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే మహాకూటమి పేరుతో ఆ రాష్ట్రంలో జట్టు కట్టారు. వీరిద్దరూ ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలువనున్నారు. ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ సోనియాతో భేటీ కానుండటం విశేషం.

2015 బీహార్ ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నితీశ్ సోనియాను కలిశారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ 2018 నుంచి జైల్లోనే ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు సీనియర్ నేతలు సోనియాను కలుస్తుండటం రాజకీయ వర్గాలో చర్చనీయాంశం అయ్యింది. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా ఇద్దరు నేతల కలవాలని భావించారు. అయితే ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉండటంతో సోనియాతో మాత్రమే చర్చలు జరుపనున్నట్ల తెలుస్తున్నది. మహాకూటమి ఏర్పాటు అయితే తప్పకుండా కేంద్రంలో బీజేపీని గద్దె దించే అవకాశం ఉంటుందని గత వారం లాలూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తాము సోనియా గాంధీని కలవబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు.

బీహార్ సీఎం నితీశ్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలసి నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే శరద్ పవర్, డీఎంకేకి చెందిన కణిమొళితో చర్చలు జరిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహాకూటమియే ప్రధాన అజెండాగా మాత్రం సోనియాను కలవట్లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాహుల్ చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలపడానికే ఈ భేటీ జరుగుతోందని చెబుతున్నాయి. అయితే, మహాకూటమి విషయం మాత్రం ఈ సమావేశంలో తప్పకుండా చర్చకు వస్తుందని ఆర్జేడీ చెబుతోంది. ఒకవైపు హోం మంత్రి అమిత్ షా బీహార్‌లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ భేటీ జరుగనుండటం ఆసక్తి కలిగిస్తోంది.

First Published:  23 Sept 2022 12:33 PM GMT
Next Story