Telugu Global
National

బీహార్: బలపరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీ సభ్యుల వాకౌట్

బీహార్ అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ ప్రభుత్వం బల పరీక్ష నెగ్గింది. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో 160 మంది ప్రభుత్వానికి మద్దతిచ్చారు. బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.

బీహార్: బలపరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీ సభ్యుల వాకౌట్
X

బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. సర్కార్ కి అనుకూలంగా 160 ఓట్లు రాగా.. ప్రతికూలంగా ఒక్క ఓటు కూడా పడలేదు. 243 మంది సభ్యులున్న సభలో.. 164 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతునిస్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్ బల పరీక్ష నెగ్గడం పెద్ద కష్టమేమీ కాలేదు. ఫ్లోర్ టెస్ట్ కి ముందు నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఓటింగ్ జరగడానికి ముందే సభ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. తనపై ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందే బీజేపీ నేత అయిన స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేయడంతో.. డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ (జేడీ-యూ) ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారు. మూజువాణీ ఓటింగ్ లో 160 మంది సభ్యులు నితీష్ సర్కార్ కే తమ ఓటని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితీష్ కుమార్.. బీజేపీపై నిప్పులు చెరిగారు. 2024 ఎన్నికల్లో తానేంటో నిరూపిస్తానని ఆ పార్టీకి సవాల్ విసిరారు. భారత స్వాతంత్య్ర సమరంలో మీరంతా ఎక్కడున్నారని, అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కె.అద్వానీ వంటి నాయకులు తనను ఎంతో గౌరవించేవారని ఆయన అన్నారు. మా జేడీ-యూ పార్టీని చీల్చాలని మీరు చూశారు.. కానీ మీ యత్నాలు వృధా అయ్యాయి అని బీజేపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 2017 లో పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా ఇవ్వాలని తాను డిమాండ్ చేశానని, కానీ ఎవరూ పట్టించుకోలేదని ఆయన కేంద్రాన్ని దుయ్యబట్టారు. కానీ ఇప్పుడు మీరు మీ పనులను అడ్వర్టైజ్ చేసుకోవడానికి అదే పని చేస్తారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం తమ పథకాలుగా చెప్పుకుంటుందని, 'హర్ ఘర్ జల్' అన్నది తమ ప్రభుత్వ పథకమని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పథకాన్ని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వ హయాంలోనే చేపట్టారన్నారు. 'మీరంతా అప్పుడు పిల్లలు.. దయచేసి నేర్చుకోండి.. ఈ స్కీములకు క్రెడిట్ కేంద్రానిది కాదు' అని నితీష్ కుమార్ బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు.

ఆర్జేడీ నేత, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా కేంద్రంపై విరుచుకపడ్డారు. తాము క్రికెటర్లమని, తమ జోడీ (ఆర్జేడీ, జేడీ-యూ) ఏనాడూ విడదీయలేని భాగస్వామ్యంతో సాగుతుందని అన్నారు. ఇది అతి సుదీర్ఘమైన ఇన్నింగ్ అవుతుంది.. ఈ భాగస్వామ్యం బీహార్ తో బాటు దేశాభివృద్ధికీ పాటు పడుతుంది ఈ సమయంలో దీన్ని ఎవరూ భంగపరచలేరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు భయపడుతారో వారిని భయపెట్టాలని, తలవంచనివారిని డబ్బులతో కొనాలన్నదే బీజేపీ ఫార్ములా అని ఆరోపించారు. రాష్ట్రంలో తాము ఓడిపోతామనే భయం కలిగినప్పుడు ఆ పార్టీ సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను ముందుకు తోస్తుందని తేజస్వి యాదవ్ చెప్పారు. 'నేను విదేశాలకు వెళ్ళినప్పుడు బీజేపీ నా కోసం లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంది.. నీరవ్ మోడీ వంటి మోసగాళ్లు పరారయితే ఇలాంటి నోటీసుల ప్రస్తావన ఉండదు ' అని ఆయన ధ్వజమెత్తారు.




First Published:  24 Aug 2022 6:58 PM IST
Next Story