ఊసరవెల్లితో నితీష్ కుమార్ పోటీ.. కాంగ్రెస్, బీజేపీ విమర్శలు
బిహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు గత పదేళ్లుగా సొంతంగా అధికారాన్ని చేపట్టే స్థానాలు దక్కడం లేదు. రెండేళ్లకోసారి కూటములు మారుస్తూ పదేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
మహాకూటమిని వీడి ఎన్డీఏతో జత కడుతున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటములు ఏర్పాటు చేయడంలో నితీష్ కుమార్ ఊసరవెల్లితో పోటీ పడుతున్నారని ఆ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ ట్విట్టర్ వేదికగా నితీష్ ను విమర్శించారు. నిత్యం రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్న నితీష్ కుమార్ ఊసరవెల్లికి పోటీ ఇస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల మనోభావాలను నితీష్ దెబ్బతీశారని విమర్శించారు. ఈ మోసానికి నితీష్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మహాకూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ సహాయంతో మళ్లీ అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న నితీష్ ను ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు సొంత కూటమి అయిన ఎన్డీఏ నేతలు కూడా విమర్శిస్తున్నారు.
నితీష్ ది అవకాశవాద రాజకీయమని పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. తాజాగా ఆయన కోల్ కత్తాలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక రాజకీయ నాయకుడు మామూలుగా ఐదేళ్లకు ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, కానీ నితీష్ లాంటి వారు వేర్వేరు కూటములతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఐదేళ్లలో కనీసం రెండు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దిలీప్ ఘోష్ విమర్శల పట్ల స్పందించేందుకు బెంగాల్ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు నిరాకరిస్తున్నారు.
బిహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు గత పదేళ్లుగా సొంతంగా అధికారాన్ని చేపట్టే స్థానాలు దక్కడం లేదు. రెండేళ్లకోసారి కూటములు మారుస్తూ పదేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు 2020లో జరిగాయి. ఎన్నికల తర్వాత ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ జేడీయూ పార్టీకి కేవలం 45 స్థానాలు మాత్రమే వచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయిన ఆర్జేడీ 79 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీకి 78, కాంగ్రెస్ కు 19 స్థానాలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఎన్డీఏ మద్దతుతో నితీష్ కుమార్ 7వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత రెండేళ్ల అనంతరం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీష్ కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేశారు. మహాకూటమి మద్దతుతో 2022లో 8వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహాకూటమిలో కూడా నితీష్ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఏడాదిన్నర తర్వాత మహాకూటమి నుంచి బయటికి వచ్చిన నితీష్ ఇవాళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఎన్డీఏ సహాయంతో 9వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలా పదేళ్లుగా పలు కూటములు కట్టి అధికారం చేపడుతున్న నితీష్ కుమార్ పై ఆర్జేడీ, కాంగ్రెస్ లతోపాటు బీజేపీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు.