మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశంసలతో ముంచెత్తిన నితిన్ గడ్కరి
దేశంలో ఆర్థిక సంస్కరణలను చక్కగా అమలు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌కు దేశం రుణపడి ఉందని మన్మోహన్ సింగ్ అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దేశం రుణపడి ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. తరచూ ఇతర పార్టీ నేతలను పొడుగుతూ గడ్కరి వార్తల్లో నిలుస్తున్నారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తుండటంతో బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా గడ్కరిపై గుర్రుగా ఉన్నది. అయినా సరే గడ్కరి మాత్రం తన వ్యవహార శైలిని మార్చుకోవడం లేదు. తాజాగా మన్మోహన్ సింగ్‌పై చేసిన ప్రశంసలు బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి.
దేశంలో ఆర్థిక సంస్కరణలను చక్కగా అమలు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌కు దేశం రుణపడి ఉందని అన్నారు. మంగళవారం టీఐవోఎల్-2022 అవార్డుల కార్యక్రమానికి గడ్కరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ప్రయోజనాలు అందించాలంటే ఉదారవాద ఆర్థిక విధానం అవసరం అన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న 1991లోనే ఈ సంస్కరణలు ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడే ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికి.. దేశానికి సరికొత్త దిశానిర్దేశనం చేశారని కొనియాడారు.
సరళీకరణతో దేశానికి కొత్త దిశానిర్దేశనం చేసిన మన్మోహన్ సింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ఆయన సంస్కరణల కారణంగానే 1990 మధ్య కాలంలో తాను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నానని.. రోడ్లు నిర్మించడానికి అవసరమైన నిధులను ఆ సంస్కరణల కారణంగానే సమీకరించానని గడ్కరి చెప్పుకొచ్చారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అలాంటి ఆర్థిక విధానం తప్పక అవసరం అన్నారు.
ఉదారవాద ఆర్థిక విధానాలను చక్కగా అమలు చేస్తోన్న చైనా మంచి ఉదాహరణ అని గడ్కిరి చెప్పారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారత్‌కు మరిన్ని క్యాపెక్స్ పెట్టుబడి అవసరం అని గడ్కరి అభిప్రాయపడ్డారు. కాగా, మన్మోహన్ సింగ్ అప్పట్లో పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారు. సంస్కరణలకు పీవీని అందరూ ఆద్యుడిగా భావిస్తారు. గడ్కరి మాత్రం ఆయన పేరును ఎత్తకుండా కేవలం మన్మోహన్ సింగ్‌నే ప్రశంసించడం గమనార్హం.