Telugu Global
National

భార్యకోసం గడ్కరీ లేఖ.. మోదీ ప్రభుత్వంపై మరో మరక

మహిళా ఐఏఎస్ డాక్టర్ అశ్వినిని బెదిరించడానికే గడ్కరీ ఈ లేఖ రాశారా, నిలిపివేసిన అడ్మిషన్లను తిరిగి కొనసాగించడానికి రాయబారాలు సాగించారా అనేది తేలాల్సి ఉంది.

భార్యకోసం గడ్కరీ లేఖ.. మోదీ ప్రభుత్వంపై మరో మరక
X

మోదీ ప్రభుత్వంలో మంత్రులంతా మాటలెక్కువ, పని తక్కువ అన్నట్టు ఉంటారు. కానీ ఒక్క నితిన్ గడ్కరీకి మాత్రం మినహాయింపు ఉంది. ప్రతిపక్షాలు గడ్కరీని పెద్దగా టార్గెట్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఆ మాటకొస్తే సొంత పార్టీయే ఆయన్ను చాలా సార్లు టార్గెట్ చేయాలనుకుంది. ఆయన కూడా తన అసంతృప్తిని పదే పదే బయటపెట్టిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆ రకంగా గడ్కరీపై వైరి వర్గాల్లో కూడా కాస్త సింపతీ ఉంది. అయితే ఇప్పుడదంతా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. భార్యకోసం ఆయన రాసిన ఓ లేఖ వైరల్ గా మారింది.

మహిళా ఐఏఎస్ బదిలీ కోసం ఫిర్యాదు..

మహారాష్ట్రలో ఓ మహిళా ఐఏఎస్‌ ని బదిలీ చేయాలని కోరుతూ సీఎం ఏక్ నాథ్ షిండేకి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాయడం సంచలనంగా మారింది. మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్‌ అశ్వినీ జోషిని బదిలీ చేయాలని కోరారు గడ్కరీ. ‘కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ (CPS)’ అనుబంధ ఇన్‌ స్టిట్యూట్‌ లు అందించే కోర్సులకు సంబంధించిన 1,100 అడ్మిషన్లు ఇటీవల నిలిపివేశారు డాక్టర్ అశ్విని. దీంతో ఆమెను వెంటనే తొలగించాలని గడ్కరీ సీఎం షిండేకి లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె పనితీరుని విమర్శించారు కూడా.

గడ్కరీకి ఏం అవసరం..?

గడ్కరీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి. ఆయనకు మెడికల్ కాలేజీల అడ్మిషన్లతో సంబంధం ఏంటి..? పోనీ విద్యార్థుల ప్రయోజనాలకోసం ఆయన లేఖ రాయాలనుకున్నా.. ఆ పని స్థానిక నాయకులతో చేయించి ఉండొచ్చు. ఇలా నేరుగా సీఎంకి లేఖ రాయడం, అది బయటకు రావడం, మహిళా ఐఏఎస్ పై గడ్కరీ విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. సదరు ‘కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ (CPS)’ అనుబంధ ఇన్‌ స్టిట్యూట్‌ ల అసోసియేషన్ సలహా మండలిలో నితిన్ గడ్కరీ భార్య, కాంచన్ గడ్కరీ సభ్యురాలు. ఆమె ప్రయోజనాలకోసమే గడ్కరీ ఈ లేఖ రాశారని తెలుస్తోంది.

ఉద్యోగులపై వేటు వేయాలంటే ముందూ వెనకా ఆలోచిస్తారేమో కానీ, బదిలీ చేయడం ప్రభుత్వాలకు చాలా తేలిక. బదిలీ అస్త్రాలను ప్రయోగిస్తారనే భయంతోనే చాలామంది ప్రభుత్వాలకు అనుకూలంగా నడచుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మహిళా ఐఏఎస్ డాక్టర్ అశ్వినిని బెదిరించడానికే గడ్కరీ ఈ లేఖ రాశారా, నిలిపివేసిన అడ్మిషన్లను తిరిగి కొనసాగించడానికి రాయబారాలు సాగించారా అనేది తేలాల్సి ఉంది. ఈ లేఖ ఆధారంగా సీఎం షిండే ఇంకా చర్యలు తీసుకోలేదు. ఈలోగా ఈ వ్యవహారం బయటపడి రచ్చ రచ్చగా మారింది. గడ్కరీపై విమర్శలు మొదలయ్యాయి.

First Published:  24 March 2023 6:56 AM IST
Next Story