Telugu Global
National

డీజిల్ వాహనాలపై పన్ను బాదుడు..! కేంద్రం క్లారిటీ

ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉపయోగించే వాహనాలపై కేంద్రం తక్కువ జీఎస్టీ విధిస్తోందని, అదే సమయంలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్ను అధికంగా ఉందనే విషయాన్ని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు.

డీజిల్ వాహనాలపై పన్ను బాదుడు..! కేంద్రం క్లారిటీ
X

డీజిల్ వాహనాలతో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది, వాటిపై అదనంగా పన్ను విధించే ఆలోచన చేస్తున్నామంటూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చూచాయగా చెప్పారు. ఆయన అలా చెప్పారో లేదో టాటా మోటార్స్, మహీంద్రా, అశోక్ లేలాండ్ కంపెనీల షేర్లు 2.5 శాతం నుంచి 4 శాతం మధ్య పడిపోయాయి. దీంతో కేంద్రం నష్టనివారణ చర్యలకు సిద్ధమైంది. నితిన్ గడ్కరీ వెంటనే మాట మార్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆటోమొబైల్ తయారీదారులకు తెలియజేయాలనుకున్నామని వివరణ ఇచ్చారు. డీజిల్ వాహనాలపై ప్రత్యేకంగా పన్ను విధించే ప్రతిపాదన లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం వాహనాలపై భారత్ లో 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు, వాహన రకాన్ని బట్టి అదనపు సెస్ 1 శాతం నుంచి 22 శాతం వరకు ఉంటుంది. అయితే కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటానికి డీజిల్ తో నడిచే వాహనాలపై 10 శాతం అదనంగా పన్ను విధించాల్సిన అవసరం ఉందన్నారు నితిన్ గడ్కరీ. దీని ద్వారా డీజిల్ వాహనాల తయారీ ఆటోమేటిక్ గా తగ్గుతుందని, తద్వారా కాలుష్యం తగ్గుతుందనేది ఆయన వాదన. అయితే ఈ వ్యాఖ్యలతో వాహన తయారీదారులు ఇబ్బంది పడ్డారు. ఆయా కంపెనీల షేర్ల విలువ పతనమైంది. ఈ వివాదానికి కేంద్రమే ఇప్పుడు ముగింపు పలికింది. ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉపయోగించే వాహనాలపై కేంద్రం తక్కువ జీఎస్టీ విధిస్తోందని, అదే సమయంలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్ను అధికంగా ఉందనే విషయాన్ని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు.


వాస్తవానికి డీజిల్ వాహనాల సంఖ్య తగ్గించేందుకు కేంద్రం చాలా కాలంగా ప్రయత్నాలు ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎయిర్ క్వాలిటీ 400 మార్కు దాటితే, ఢిల్లీ, గురుగావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్‌ లలో BS III పెట్రోల్, BS IV డీజిల్ ఫోర్ వీలర్లను వెంటనే నిషేధించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేస్తోంది. దీనికి కొనసాగింపుగా డీజిల్ వాహనాలపై పన్నుభారం పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 12న, ఆటోమొబైల్ తయారీదారుల సంఘం SIAM వార్షిక సదస్సులో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయనే ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూని ఆయనే ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

First Published:  15 Sept 2023 11:13 AM IST
Next Story