వాజ్ పేయి,అద్వానీల వల్లే మేం అధికారంలో ఉన్నాం..గడ్కరీ
మేమీరోజు అధికారంలోకి ఉండడానికి వాజ్‌పేయి, అద్వానీలే కారణమని బీజేపీ నేత నితిన్ గడ్కరీ అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తనను తొలగించిన తర్వాత తొలిసారి గడ్కరీ నాగ్ పూర్ లో మాట్లాడారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తనను తొలగించిన తర్వాత తొలిసారి గడ్కరీ గొంతు విప్పారు. కేంద్రంలో ఈ రోజు తమ పార్టీ అధికారంలో ఉందంటే దానికి కారణం అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారే అని ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
'గతంలో ఓ సారి వాజ్ పేయి మాట్లాడుతూ చీకటి తొలిగిపోయి సూర్యుడు బైటికి వస్తాడు. కమలం వికసిస్తుంది అని చెప్పారు. అది నిజమవడానికి వాజ్ పేయి, అద్వాణీ నిరంతరం కష్టపడ్డారు. ఇప్పుడు మేము ఫలితాలు అనుభవిస్తున్నాం'' అని గడ్కరీ అన్నారు.
ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల గురించి రాజకీయ నాయకులు ఆలోచిస్తారని, దేశం గురించి, సమాజం గురించి ఆలోచించేవారు, ఆర్థిక సంస్కర్తలు రాబోయే శతాబ్దం గురించి ఆలోచిస్తారని గడ్కరీ అన్నారు. ఈ విషయాన్ని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త దత్తోపంత్ ఠెంగడీ గతంలో చెప్పారని గడ్కరీ గుర్తు చేశారు.