Telugu Global
National

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. 100మందికి పైగా అరెస్ట్..

గత రెండు విడతల్లో స్థానికులనుంచి ఎదురైన ప్రతిఘటనలు దృష్టిలో ఉంచుకుని ఈసారి పారామిలట్రీ బలగాలతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఇప్పటికే 100మందికి పైగా పీఎఫ్ఐ ప్రతినిధుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. 100మందికి పైగా అరెస్ట్..
X

దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. గత రెండు విడతల్లో ఎన్ఐఏ టార్గెట్ ఏంటో స్పష్టమైంది. పాపురల్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్ఐ) నేతల్ని లక్ష్యంగా చేసుకుని ఎన్ఐఏ దాడులు చేస్తోంది. గత రెండు విడతల్లో స్థానికులనుంచి ఎదురైన ప్రతిఘటనలు దృష్టిలో ఉంచుకుని ఈసారి పారామిలట్రీ బలగాలతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఇప్పటికే 100మందికి పైగా పీఎఫ్ఐ ప్రతినిధుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, అస్సోం, ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం రోహిణి, నిజాముద్దీన్‌, జామియా, షహీన్ బాగ్‌, సెంట్రల్‌ ఢిల్లీ ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. 30 మందిని అదుపులోకి తీసుకుంది. జామియా యూనివర్శిటీ పరిధిలో 144 సెక్షన్‌ విధించి మరీ ఈ దాడులు కొనసాగించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, సోలాపూర్‌ లో కూడా పారా మిలట్రీ బలగాల సాయంతో దాడులు చేస్తున్నారు. కర్నాటక, అస్సోం, యూపీలో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అత్యథిక అరెస్ట్ లు ఢిల్లీనుంచే ఉన్నాయి. ఢిల్లీలో 30మందిని అరెస్ట్ చేయగా, కేరళలో 22, మహారాష్ట్రలో 20మందిని అరెస్ట్ చేశారు. మిగతా ప్రాంతాల్లో కూడా అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. పీఎఫ్ఐ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, లష్కరే తోయిబా, ఐసిస్‌, అల్‌ ఖైదా వంటి ఉగ్రముఠాల్లో చేరేలా యువతను ప్రేరేపిస్తోందని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

First Published:  27 Sept 2022 5:00 AM GMT
Next Story