Telugu Global
National

ఏక‌కాలంలో 100కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

విదేశాల్లో దాక్కున్న కొందరు గ్యాంగ్‌స్ట‌ర్లు ఖలిస్థానీ వేర్పాటువాదుల సహకారంతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఎన్ఐఏ ఈ సోదాలు చేపట్టినట్టు అధికారిక వర్గాలు వెల్ల‌డించాయి.

ఏక‌కాలంలో 100కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
X

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏక‌కాలంలో 100కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేప‌ట్టింది. 6 రాష్ట్రాల్లో బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచే చేప‌ట్టిన ఈ త‌నిఖీల్లో భాగంగా ఆయా రాష్ట్రాల పోలీసుల స‌హ‌కారం తీసుకుంది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్టు ఎన్ఐఏ వ‌ర్గాలు తెలిపాయి.

ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్, గ్యాంగ్‌స్ట‌ర్ల‌కు సంబంధించిన కేసుల్లో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన ఎన్ఐఏ.. గతేడాది నమోదైన మూడు వేర్వేరు కేసులకు సంబంధించి ఈ సోదాలు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం. ఖలిస్థానీ వేర్పాటు వాద సంస్థ నాయకుల అనుచరులు, గ్యాంగ్‌స్ట‌ర్‌ ముఠా సభ్యుల మద్దతుదారుల ఇళ్లలో ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.

ఖలిస్థానీ మద్దతుదారులు దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. విదేశాల్లో దాక్కున్న కొందరు గ్యాంగ్‌స్ట‌ర్లు ఖలిస్థానీ వేర్పాటువాదుల సహకారంతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఎన్ఐఏ ఈ సోదాలు చేపట్టినట్టు అధికారిక వర్గాలు వెల్ల‌డించాయి.

First Published:  17 May 2023 3:09 PM IST
Next Story