Telugu Global
National

క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల‌ను అండ‌మాన్ జైలుకు త‌ర‌లించండి..

ఢిల్లీలోని తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న 10 నుంచి 12 మంది నేరగాళ్లను వీలైనంత త్వరగా అండమాన్‌కు పంపాలని లేఖలో కోరింది. కొందరు నేరస్తులు జైల్లోనే ఉంటూ.. గ్యాంగులు నిర్వ‌హిస్తున్నార‌ని ఎన్ఐఏ వెల్ల‌డించింది.

క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల‌ను అండ‌మాన్ జైలుకు త‌ర‌లించండి..
X

వివిధ జైళ్ల‌లో శిక్ష అనుభ‌విస్తున్న క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల‌ను అండ‌మాన్ జైలుకు త‌ర‌లించాల‌ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా ఈ విష‌యం తెలిసింది. ముఖ్యంగా ఢిల్లీలోని తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న 10 నుంచి 12 మంది నేరగాళ్లను వీలైనంత త్వరగా అండమాన్‌కు పంపాలని లేఖలో కోరింది. కొందరు నేరస్తులు జైల్లోనే ఉంటూ.. గ్యాంగులు నిర్వ‌హిస్తున్నార‌ని ఎన్ఐఏ వెల్ల‌డించింది.

అండమాన్ నికోబార్ దీవులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండటం వల్ల, నేరస్తుల‌ను అక్కడికి తరలించేందుకు ఇతర రాష్ట్రాల మాదిరిగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఎన్ఐఏ తన లేఖలో పేర్కొంది. వీరి తరలింపుపై కేంద్ర హోం మంత్రిత్వశాఖను అభ్యర్థిస్తూ ఎస్ఐఏ లేఖ రాయడం ఇది రెండోసారి. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ సహా 25 మంది నేరస్తులను దక్షిణభారతదేశంలోని వివిధ జైళ్లకు తరలించాలని కోరుతూ కొన్ని నెలల క్రితం ఎన్ఐఏ కేంద్రానికి లేఖ రాసింది.

తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్ట‌ర్ టిల్లు తాజ్పురియా హత్య తర్వాత ఆ జైలులో శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరస్తులను ఇతర జైళ్లకు తరలించాలని తీహార్‌ జైలు అధికారులు కూడా హోం మంత్రిత్వ శాఖను కోరారు. తీహార్‌ కేంద్ర కారాగారం పరిధిలో 16 జైళ్లు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి మొత్తం 10 వేల మందిని ఉంచేందుకు వెసులుబాటు ఉంది. కానీ, 20 వేలకు పైగా నేరస్తులు అందులో శిక్ష అనుభవిస్తున్నారు. అందులో కరుడుగట్టినవారు కూడా ఉన్నారని, వాళ్ల వల్ల జైలులో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని జైలు అధికారులు చెబుతున్నారు.

టిల్లు తాజ్పురియా హత్య తర్వాత జైలులో అధికారులు 2000 ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట్లు ప్రత్యేక బల్బులు అమర్చారు. టిల్లు తాజ్పురియాను ప్రత్యర్థి గోగీ ముఠాలోని నలుగురు సభ్యులు 92 సార్లు పొడిచి చంపిన సంగతి తెలిసిందే. దీనికి కోసం వారు ప్రత్యేకమైన ఆయుధాలను వినియోగించారు. తొలి అంతస్తులో ఉన్న నిందితులు ఇనుప చువ్వలను విరగ్గొట్టి.. బెడ్‌షీట్ల సాయంతో కిందికి దిగి హత్య చేసినట్లు పోలీసులు అప్పట్లో తెలిపారు.

First Published:  3 July 2023 7:40 AM IST
Next Story