Telugu Global
National

గ్యాంగ్‌స్టర్లపై కొరడా.. దేశంలో 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

ఇప్పటికే లారెన్స్‌ బిష్ణోయ్, నీరజ్ బవానా గ్యాంగ్‌లకు చెందిన 10 మందిపై ఢిల్లీ పోలీసులు ఉపా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ చేపట్టిన క్రమంలోనే ఇవ్వాళ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

గ్యాంగ్‌స్టర్లపై కొరడా.. దేశంలో 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
X

పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాల హత్యతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తం అయ్యాయి. అతడి హత్యలో అరెస్టయిన నిందితులు, ఉగ్ర సంస్థలకు మధ్య బలమైన సంబంధాలు ఉన్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. ఈ సంబంధాలను పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ వినియోగించుకుంటోందని వెల్లడించారు. దీంతో ఈ గ్యాంగ్ స్టర్ల ఆట కట్టించేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో భారీ స్థాయిలో దాడులు చేసింది. ఢిల్లీలో కూడా స్థానిక పోలీసుల సహకరంతో గ్యాంగ్‌స్టర్లకు చెందిన స్థావరాల్లో సోదాలు చేస్తోంది.

ఇప్పటికే లారెన్స్‌ బిష్ణోయ్, నీరజ్ బవానా గ్యాంగ్‌లకు చెందిన 10 మందిపై ఢిల్లీ పోలీసులు ఉపా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ చేపట్టిన క్రమంలోనే ఇవ్వాళ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం ఇండియాలోనే కాకుండా, అంతర్జాతీయ జైళ్లలో ఉండి కూడా ఇక్కడ కార్యకాలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోల్డీ బ్రార్ అనే వ్యక్తి కెనడా నుంచే మూసేవాలా హత్యకు ప్రణాళిక రచించినట్లు తెలిసిందే. కేవలం హత్య కేసు నిందితులనే మాత్రమే కాకుండా అక్రమాయుధాలు స్మగ్లింగ్ చేసే వారిపై కూడా ఎన్ఐఏ దృష్టిపెట్టింది.

ఉత్తరాధిలో ఇటీవల జరిగిన హత్యలకు నీరజ్ బవానా, అతడి గ్యాంగే మూల కారణమని ఎన్ఐఏ గుర్తించింది. సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకొని.. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నీరజ్, లారెన్స్ గ్యాంగుకు మధ్య ప్రస్తుతం విభేదాలు ఉన్నాయి. వీటిని ఉపయోగంచుకొనే ఎన్ఐఏ రెండు గ్యాంగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మూసేవాలా హత్యకు కారణమైన లారెన్స్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీసుకుంటామని నీరజ్ బవానా అందుకే ప్రకటించారని ఎన్ఐఏ చెబుతోంది. మరోవైపు లారెన్స్, గోల్డీ బ్రార్ వంటి గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరులు ఇండియాతో పాటు కెనడా, పాకిస్తాన్, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇవ్వాళ జరిగిన సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మరింత మంది గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

First Published:  12 Sept 2022 1:59 PM IST
Next Story