వచ్చే యేడాది భారత్ కు అత్యంత కీలకం..సంస్కరణలతోనే వృద్ధి సాధ్యం - రఘురామ రాజన్
భారత ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా కష్టాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్ధిక నిపుణుడు రఘురామ రాజన్ అంచనా వేశారు. అయితే దీనిని సమర్ధంగా ఎదుర్కోవడానికి మరిన్ని సంస్కరణలు అవసరమని ఆయన సూచించారు.
భారత ఆర్ధిక పరిస్థితి, సంస్కరణలపై ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్ధిక నిపుణుడు రఘురామ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే యేడాది భారత్ కు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.
భారత ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా కష్టాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. అయితే దీనిని సమర్ధంగా ఎదుర్కోవడానికి మరిన్ని సంస్కరణలు అవసరమని ఆయన సూచించారు. దురదృష్టశాత్తు దేశం సంస్కరణల అమలులో ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతోందని అన్నారు. అవసరమైన సంస్కరణలను రూపొందించటంలో దేశం విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు.భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే సవాళ్ల గురించి ముందుగానే ఆయన హెచ్చరించారు. గతంలో కూడా రాజన్ భారత ఆర్ధిక వ్యవస్తకు సంబంధించి ముందుగానే పలు సార్లు అనేక సూచనలు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి వల్ల అత్యధికంగా ఇబ్బందులను ఎదుర్కొన్న దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందించడంలో సరైన చర్యలు లేవన్నారు. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణమైన విధానలను రూపొందించాలని రాజన్ కోరారు. అలాగే, కుదేలైన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనిచ్చే విధానాలను దేశంలోని ప్రభుత్వాలు రూపొందించాలని సూచించారు.
అదే విధంగా సుస్థిర ఇంధన రంగంలో హరిత విప్లవానికి ఊతమివ్వాలని కూడా రాజన్ పిలుపునిచ్చారు. 2023 ప్రపంచ దేశాలకు మాత్రమే కాక భారతదేశానికి కూడా చాలా ముఖ్యమని రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. దీనిపై ఆర్థిక నిపుణులు సైతం దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి మాంద్యం సూచనలు క్రమంగా నెమ్మదించటం.. వడ్డీ రేట్ల పెంపు కొనసాగటం సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వృద్ధి, ప్రజల కొనుగోళ్ళు తగ్గుతాయని వ్యాపార వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.
అవసరమైన సంస్కరణలను అమలు చేయకపోతే ఆర్థికవృద్ధి వేగం మందగిస్తుందని రఘురామ రాజన్ అన్నారు. సరైన సంస్కరణలతో, భారత్ వృద్ధి వేగం పెరుగుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు. దేశంలో రాజకీయ గందరగోళం, అంతర్గత తగాదాల వల్ల వృద్ధి రేటు నెమ్మదిస్తుందని ఆయన అన్నారు.
మనం నిజంగా వృద్ధిని సృష్టించే సంస్కరణలను రూపొందించలేదు, "అని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ నిర్మొహమాటంగా చెప్పారు.
నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించనందున ప్రయివేటు రంగాన్నిఆశ్రయించాల్సి వస్తోందన్నారు. సాంకేతికతను జోడిస్తే వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్ద పరిశ్రమలుగా ఎదగడానికి అనుకూలమైన వాతావరణంతో పాటు అందుకు అనుగుణమైన సదుపాయాలు కల్పించడం కూడా అవసరమని కూడా రాజన్ సూచించారు.