భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులు.. వచ్చే వేసవి మహా డేంజర్
భారత్ లో పనిచేసే శ్రామికుల్లో 75శాతం మంది, అంటే దాదాపు 38కోట్ల మంది మండుటెండల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని, వడగాల్పులతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వరల్డ్ బ్యాంక్ నివేదిక చెబుతోంది.
వచ్చే ఏడాది వేసవి మహా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా భారత్ లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశముందని అంటున్నారు. ఈమేరకు వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. క్లైమేట్ ఇన్వెస్ట్ మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్ అనే పేరుతో వరల్డ్ బ్యాంక్ ఓ నివేదిక రూపొందించింది. కేరళ ప్రభుత్వ భాగస్వామ్యంతో తిరువనంతపురంలో రెండురోజులపాటు జరిగే సదస్సులో ఈ నివేదిక విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన సమాచారం మాత్రం ముందుగానే బయటకొచ్చింది. 2024 వేసవి భారత్ లో అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నాయని వరల్డ్ బ్యాంక్ నివేదిక చెబుతోంది.
వచ్చే ఏడాది వేసవి కాస్త ముందస్తుగా వస్తుందనే అంచనాలున్నాయి. గతం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని, వడగాల్పుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వేసవి తీవ్రత అత్యథికంగా ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచే అవకాశముందని, మానవ మనుగడకే ఇది పెద్ద ముప్పు అని అంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఏడాదీ వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, ఈసారి మాత్రం దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
భారత్ లో పనిచేసే శ్రామికుల్లో 75శాతం మంది, అంటే దాదాపు 38కోట్ల మంది మండుటెండల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని, వడగాల్పులతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వరల్డ్ బ్యాంక్ నివేదిక చెబుతోంది. ఇక ఉపాధిపై కూడా ఉష్ణోగ్రతల ప్రభావం కనిపించే అవకాశముంది. భారీ ఉష్ణోగ్రతలు, దాని వల్ల వచ్చే పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా 8కోట్లమంది ఉపాధి కోల్పోతారని, అందులో 3.4కోట్లమంది భారత్ లో ఉంటారని అంచనా వేస్తున్నారు.