Telugu Global
National

జస్టిస్ డీవై చంద్రచూడ్ అరుదైన రికార్డు.. తండ్రి తీర్పులనే తిరగరాసిన జడ్జి

తండ్రికొడుకు సీజేఐలుగా పని చేయడం ఇండియాలో ఇదే తొలిసారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా గతంలో సీజేఐగా పని చేశారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్ అరుదైన రికార్డు.. తండ్రి తీర్పులనే తిరగరాసిన జడ్జి
X

భారత సుప్రీంకోర్డు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించాలంటూ ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. దీంతో 50వ సీజేఐగా చంద్రచూడ్ నియామకం దాదాపు ఖరారు అయ్యింది. సీజేఐ యూయూ లలిత్ లేఖను న్యాయ శాఖకు పంపుతారు. ఆ తర్వాత ఆ లేఖ ప్రధాని పరిశీలన కోసం వెళ్తుంది. ఆయన ఆమోదం తెలిపాక రాష్ట్రపతి వద్దకు చేరుకుంటుంది. రాష్ట్రపతి ఆమోదంతో డీవై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రచూడ్ సీజేఐగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2024 నవంబర్ 10న ఆయన పదవీ విరమణ చేస్తారు. కాగా, డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు చరిత్రలో ఓ అరుదైన రికార్డు సృష్టించారు.

తండ్రికొడుకు సీజేఐలుగా పని చేయడం ఇండియాలో ఇదే తొలిసారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా గతంలో సీజేఐగా పని చేశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో వైవీ చంద్రచూడ్ జడ్జిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు సీజేఐగా నియమించబడ్డారు. ఆయన కుమారుడిగా న్యాయ శాస్త్రంపై మక్కువ పెంచుకున్న డీవై చంద్రచూడ్ అదే బాటలో నడిచారు. సుప్రీంకోర్టు జస్టీస్‌గా పని చేస్తున్న సమయంలోనే తన తండ్రి ఇచ్చిన రెండు తీర్పులను కొట్టేసి.. దానికి వ్యతిరేక తీర్పులు ఇవ్వడం గమనార్హం.

వైవీ చంద్రచూడ్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ అధినేత్రి, ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇందిర నిర్ణయాన్ని 1975లో జస్టిస్ వైవీ చంద్రచూడ్ సమర్థించారు. దీంతో ఇందిర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అనేక ఆంక్షలు విధించింది. అనేక మంది నాయకులు జైలు పాలయ్యారు. అంతే కాకుండా మీడియాపై కూడా నిషేధం విధించారు. 1976లో ప్రాథమిక హక్కులను పూర్తిగా సస్పెండ్ చేసి ఎమర్జెన్సీ విధించడంతో అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు ఎమర్జెన్సీని సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో వైవీ చంద్రచూడ్ సీనియర్ కావడం గమనార్హం. ఆ సమయంలో బెంచ్‌లో సభ్యుడైన జస్టీస్ హెచ్‌ఆర్ ఖన్నా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి భయపడి న్యాయ దేవత కూడా నోరు మూసుకోవల్సిన పరిస్థితులు తలెత్తాయని.. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు.

కాగా, 41 ఏళ్ల తర్వాత తండ్రి వైవీ చంద్రచూడ్ బెంచ్ ఇచ్చిన తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్ తప్పబట్టారు. ఆ తీర్పు పూర్తిగా లోపభూయిస్టమైనదిగా అభివర్ణించారు. అంతే కాకుండా ఆనాడు హెచ్ఆర్ ఖన్నా చేసిన వ్యాఖ్యలను అభినందించారు. ఆ రోజు ఖన్నా చేసిన వ్యాఖ్యలను బెంచ్ తీసుకోవల్సిందని.. ఆయన వ్యాఖ్యలను పట్టించుకోకపోవడం తీవ్రమైన తప్పని చంద్రచూడ్ అన్నారు. 2017లో రైట్ టూ ప్రైవసీని ప్రాథమిక హక్కుగా పేర్కొంటు డీవై చంద్రచూడ్ బెంచ్ తీర్పు చెప్పింది.

ఇక మరో కేసులో కూడా తండ్రి ఇచ్చిన తీర్పును విభేదించారు. 2018లో సుప్రీంకోర్టు బెంచ్ వ్యభిచారాన్ని క్రైమ్ కాదని తీర్పు చెప్పింది. ఇద్దరికి సమ్మతం అయిన సందర్భంలో అది నేరమెలా అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆనాడు తీర్పు ఇచ్చిన బెంచ్‌లో డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. కాగా, 1985లో జస్టిస్ చంద్రచూడ్ వ్యభిచారాన్ని, అక్రమ సంబంధాలను తీవ్రమైన నేరాలుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు. అంతే కాకుండా మగవాళ్లు మాత్రమే ఆడవారిని లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తారని, ఆడవాళ్లు అలా చేయరని కూడా వైవీ చంద్రచూడ్ పేర్కొన్నారు. సెక్షన్ 497 ప్రకారం ఇది తీవ్రమైన నేరంగా ఆయన పేర్కొన్నారు. కానీ ఆనాటి తీర్పును పక్కన పెట్టి వ్యభిచారం నేరం కాదని,. అలాగే ఇద్దరు వ్యక్తులు పరస్పర సమ్మతితో సెక్స్ చేస్తే కూడా నేరం కాదని తీర్పు చెప్పారు. అదే సమయంలో తమ భార్య లేదా భాగస్వామిని మోసం చేసినందుకు గాను విడాకులు తీసుకోవడానికి మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఇలా తండ్రి ఇచ్చిన రెండు ముఖ్యమైన తీర్పులను డీవై చంద్రచూడ్ తిరిగి రాయడం గమనార్హం.

డీవై చంద్రచూడ్ కెరీర్..

ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి పూర్తి పేరు యశ్వంత్ విష్ణు చంద్రచూడ్. ఆయన దేశ చరిత్రలో అత్యధిక కాలం సీజేఐగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇక డీవై చంద్రచూడ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1998లో ఇండియా అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమించబడ్డారు. 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టీస్‌గా ప్రమోషన్ వచ్చింది. 2016లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడ్డారు. 2021లో సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా చేరారు.

First Published:  12 Oct 2022 12:15 AM GMT
Next Story