Telugu Global
National

ప్రైవేట్‌ ఆస్తులన్నీ సమాజ వనరు కాదు

ప్రైవేట్‌ ఆస్తులను సమాజ వనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అన్న అంశంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

ప్రైవేట్‌ ఆస్తులన్నీ సమాజ వనరు కాదు
X

ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రైవేట్‌ ఆస్తులను సమాజ వనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అన్న అంశంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేట్‌ యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం 7:2 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. సీజేఐ తీర్పుతో బెంచ్‌లోని జస్టిస్‌ బీవీ నాగరత్న పాక్షికంగా విభేదించగా.. జస్టిస్‌ సుధాంషు ధూలియా అన్ని అంశాలను పూర్తిగా విభేదించారు. అయితే కొన్ని ప్రైవేట్‌ ఆస్తుల విషయంలో రాష్ట్రాలు దావా వేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39 (బీ) ప్రకారం ప్రైవేట్‌ యాజమాన్యంలోని అన్ని వనరులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చని జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది.

'ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే.. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. వీటిపై ప్రస్తుతం ప్రైవేటీకరణ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉన్నది' అని అభిప్రాయపడింది. '1950ల్లో భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పడు వ్యాఖ్యానం చేయకూడదు. అప్పుడు జాతీయీకరణ జరుగుతున్నది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతున్నది. ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. ఇది పరివర్తన. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం కొత్తగా ఉండాలి. ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి' అని ధర్మాసనం పేర్కొన్నది. తాజాగా ఈ వ్యాఖ్యాలను పునరుద్ఘాటిస్తూ దీనిపై తీర్పు వెలువరించింది.

First Published:  5 Nov 2024 2:31 PM IST
Next Story