Telugu Global
National

ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన

బిహార్‌ రాష్ట్రంలోని అరారియా జిల్లాలో గల బక్రా నదిపై ఈ వంతెనను నిర్మించారు.

ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన
X

దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందు కుప్పకూలింది. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశం. వంతెన కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బిహార్‌ రాష్ట్రంలోని అరారియా జిల్లాలో గల బక్రా నదిపై ఈ వంతెనను నిర్మించారు. కుస్రా కాంతా–కిస్రీ ప్రాంతాలను కలిపే ఈ వంతెన పదరియా ఘాట్‌ సమీపంలో ఉంది. మంగళవారం ఉదయం ఈ వంతెన భారీ శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత 3 పిల్లర్లు కూలిపోయాయని ఈ సందర్భంగా వారు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అరారియా జిల్లా కలెక్టర్‌ తెలిపారు. జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.12 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ.. ఇరువైపులాS అప్రోచ్‌ రోడ్డు పనులు మిగిలి ఉండటంతో దీనిని ప్రారంభించలేదని సమాచారం.

మరోపక్క ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే విజయ్‌ మండల్‌ స్పందిస్తూ.. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇది కుప్పకూలిందని ఆరోపించారు. ఈ ఏడాది మార్చిలోనూ బిహార్‌ రాష్ట్రంలోని సుపౌల్‌ జిల్లా కోసి నదిపై నిర్మించిన ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పది మందికి పైగా గాయపడ్డారు. అప్పట్లో ఆ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజా ఘటనతో బిహార్‌లో ఇటీవల కాలంలో నిర్మించిన వంతెనల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


First Published:  18 Jun 2024 3:54 PM GMT
Next Story