Telugu Global
National

పోలీసుల బూటు కాళ్ల కింద నలిగి పసికందు మృతి

పోలీసులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న భూషణ్ పాండే తిరిగి ఇంటికి చేరాడు. ఇంట్లో వదలి వెళ్ళిన పసికందు చనిపోయి కనిపించింది.

పోలీసుల బూటు కాళ్ల కింద నలిగి పసికందు మృతి
X

నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల బూటు కాళ్ల కింద పడి నాలుగు రోజుల పసికందు మృతి చెందిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీసులు వస్తున్నారనే భయంతో ఇంట్లో పసికందును వదిలి పరారు కాగా.. పోలీసులు హడావుడిగా ఇంట్లోకి వస్తున్న క్రమంలో పసికందును తమ బూటు కాళ్ళతో తొక్కడంతో ఆ చిన్నారి మృతిచెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

గిరిడీ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన భూషణ్ పాండే ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు అతడిని పట్టుకునేందుకు చాలా రోజులుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో భూషణ్ పాండే ఇంటి వద్ద నిఘా కూడా పెట్టారు. ఓ రోజు భూషణ్ ఇంటికి రావ‌డాన్ని పోలీసులు గుర్తించారు.

సిబ్బందితో పోలీసు అధికారులు భూషణ్ పాండే ఇంటి వద్దకు వచ్చారు. అయితే పోలీసుల రాకను భూషణ్ పాండే ముందే పసిగట్టాడు. కుటుంబ సభ్యులతో సహా ఇంటి నుంచి పారిపోయాడు. అయితే నాలుగు రోజుల పసికందును మాత్రం ఇంట్లోనే వదిలి వెళ్లాడు. పోలీసు అధికారులు భూషణ్ ఇంట్లోకి వచ్చి చూడగా ఎవరూ కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

పోలీసులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న భూషణ్ పాండే తిరిగి ఇంటికి చేరాడు. ఇంట్లో వదలి వెళ్ళిన పసికందు చనిపోయి కనిపించింది. పసికందు మృతదేహంపై పోలీసుల బూటు కాళ్ల గుర్తులు ఉన్నాయని, వారు తొక్కడం వల్లే చిన్నారి చనిపోయినట్లు భూషణ్ పాండే కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు.

దర్యాప్తున‌కు ఆదేశించిన సీఎం సోరెన్

కాగా, పోలీసులు బూటు కాళ్లతో తొక్కడంవల్లే చిన్నారి చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల తీరు పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని గిరిడీ జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. భూషణ్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు వాదిస్తున్నారు. తనపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకే భూషణ్ తమపై ఆరోపణలు చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఏది ఏమైనా చిన్నారి మృతి మిస్టరీగా మారింది.

First Published:  24 March 2023 7:53 PM IST
Next Story