Telugu Global
National

కాలేజీలో చేరాలంటే ఓటర్ కార్డ్ తప్పనిసరి.. మహారాష్ట్రలో కొత్త రూల్

మహారాష్ట్రలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు కాలేజీలో అడ్మిషన్ కావాలంటే ఓటర్ కార్డ్ చూపించాల్సిందే. ఈ మేరకు త్వరలో ప్రభుత్వం తీర్మానం చేయబోతున్నట్టు ప్రకటించారు మంత్రి చంద్రకాంత్ పాటిల్.

కాలేజీలో చేరాలంటే ఓటర్ కార్డ్ తప్పనిసరి.. మహారాష్ట్రలో కొత్త రూల్
X

ఇంటర్ కాలేజీలో చేరాలంటే టెన్త్ క్లాస్ పాసై ఉండాలి, డిగ్రీలో చేరాలంటే ఇంటర్ పాస్ సర్టిఫికెట్, టీసీ తప్పనిసరి. ఇలా ఏ కాలేజీలో చేరాలన్నా అంతకు ముందు చదివి పాసైన సర్టిఫికెట్లు ఉండాలి. కొత్తగా ఆధార్ కార్డ్ కూడా తప్పనిసరి చేస్తున్నారు. ఇకపై మహారాష్ట్రలో ఓటర్ కార్డ్ కూడా తప్పనిసరి కాబోతోంది. 18 ఏళ్లు నిండిన విద్యార్థులు కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే ఓటర్ కార్డ్‌ని కూడా చూపించాల్సిందే.

ఓటుతో సంబంధం ఏంటి..?

కాలేజీలో చేరాలంటే చదువు కావాలి కదా, ఓటర్ కార్డ్ ఎందుకు అనుకుంటున్నారా..? యువతలో ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించేందుకు, ప్రజాస్వామ్యం మన హక్కే కాదు, బాధ్యత అని గుర్తు చేసేందుకు ఈ నియమం తీసుకురాబోతున్నారు. ఈ మేరకు త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయబోతున్నట్టు ప్రకటించారు ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్.

విద్యార్థుల్లో ఓటుహక్కు ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారని, యూనివర్శిటీలో చదువుకునే వారు ఇతర అన్ని విషయాలపై అవగాహనతో ఉండాలని, ముఖ్యంగా రాజకీయాలపై వారికి అవగాహన ఉండాలని చెప్పారు మంత్రి చంద్రకాంత్ పాటిల్. ప్రజాస్వామ్యంపై అవగాహన ఉంటే కచ్చితంగా విద్యార్థులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటారని చెప్పారు. యువత రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటే కచ్చితంగా మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో తప్పుడు వ్యక్తిని ఎన్నుకోవడం ఎంత ప్రమాదకరమో, ఓటు వేయకుండా తమ హక్కుని నిర్వీర్యం చేసుకోవడం అంతకంటే ప్రమాదకరమని చెప్పారు పాటిల్. ఇకపై 18 ఏళ్లు దాటిన విద్యార్థులు ఏ కోర్స్ లో చేరాలన్నా ఓటరు గుర్తింపు కార్డ్ తప్పనిసరి చేయబోతున్నట్టు ప్రకటించారు.

First Published:  25 Nov 2022 2:39 PM IST
Next Story