Telugu Global
National

సెలబ్రిటీలకు కష్టకాలం.. ఎడాపెడా అడ్వర్టైజ్మెంట్లు చెల్లవు

"సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లు వ్యక్తిగతంగా ఉపయోగించకుండా.. ఎలాంటి ఉత్పత్తికైనా ప్రచారం చేయకూడదు. తాము ఉపయోగించి, ఆ తర్వాత ప్రచారం చేస్తూ.. తమకు ఎదురైన అనుభవాలను ప్రకటనలో వివరించాలి."

సెలబ్రిటీలకు కష్టకాలం.. ఎడాపెడా అడ్వర్టైజ్మెంట్లు చెల్లవు
X

ఫలానా సబ్బు వాడండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి అంటూ హీరో మహేష్ బాబు ఇక చెప్పలేరేమో. ఎందుకంటే ముందు ఆయన ఆ సబ్బు వాడి, దానిపై వ్యక్తిగతంగా తన అభిప్రాయాన్ని చెప్పాలి. అలా అయితేనే ఆయన యాడ్ చెల్లుబాటవుతుంది. ఫలానా కాలేజీలో లో మీ పిల్లవాడిని చేర్పించండి, మీకు ఐఐటీ సీటు గ్యారెంటీ అంటూ ఇకపై సెలబ్రిటీలు కేవలం డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేయలేరు. ఎందుకంటే ముందు వారి పిల్లల్ని ఆయా కాలేజీల్లో చేర్పించి చదివించాలి, ఆ తర్వాతే ప్రచారం చేయాలి. వ్యక్తిగతంగా ఆయా ఉత్పత్తులను వినియోగించకుండా, వాటి గురించి ప్రచారం చేయడం తగదు అని వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని పేర్కొంది.

పాన్ మసాలా అయినా, లిక్కర్ బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసే వాటర్ బాటిల్స్ యాడ్స్ అయినా.. కొంతమంది ఎడాపెడా అన్ని రకాల ప్రకటనల్లో నటిస్తుంటారు. నమ్మకానికి అమ్మవంటిది అంటూ ఊదరగొడుతుంటారు. అభిమానులు ఆ మోజులో పడి ఆయా ప్రోడక్ట్స్ పై నమ్మకాన్ని పెంచుకుంటారు. చివరకు ఫలితాలు వేరేగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు రాకపోగా దుష్ఫలితాలు కూడా రావొచ్చు. అప్పుడు సెలబ్రిటీలను ఎవరూ తప్పుబట్టలేరు. అలాగని కంపెనీలను కూడా నిలదీయడానికి నిబంధనలు అడ్డొస్తాయి. అందుకే ముందుగా ప్రచారం దగ్గర్నుంచే వీటికి అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నం మొదలైంది.

‘‘సెలబ్రిటీలు లేదా సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లు వ్యక్తిగతంగా ఉపయోగించకుండా.. ఎలాంటి ఉత్పత్తికైనా ప్రచారం చేయకూడదు. తాము ఉపయోగించి, ఆ తర్వాత ప్రచారం చేస్తూ.. తమకు ఎదురైన అనుభవాలను ప్రకటనలో వివరించాలి. ఆయా ఉత్పత్తులకు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది వినియోగదారులకు అర్థమయ్యేలా సులభతరమైన పద్ధతిలో వివరించాలి. ఒకవేళ లైవ్‌ లో ప్రచారం చేస్తుంటే, ఆ కార్యక్రమం ప్రసారం అవుతున్నంతసేపు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది వినియోగదారులకు తెలిసేలా స్క్రీన్‌ పై టెక్స్ట్ డిస్‌ ప్లే చేయాలి. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేట్లయితే హ్యాష్‌టాగ్‌ ద్వారా తెలియజేయాలి.

అన్నీ చెప్పాల్సిందే..

సెలబ్రిటీలు తాము ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది కూడా చెప్పాలంటోంది వినియోగదారుల వ్యవహారాల శాఖ. అది కేవలం ప్రకట మాత్రమేనా, లేదా ఆ కంపెనీ నుంచి నగదు తీసుకుని దాన్ని స్పాన్సర్డ్ చేస్తున్నారా లేదా ఒప్పందం చేసుకున్నారా, ఆయా కంపెనీల్లో వారి భాగస్వామ్యం ఉండటం వల్ల ప్రచారం చేస్తున్నారా అనే విషయాలను కూడా ఇకపై బయటపెట్టాల్సిందే.

ఎడాపెడా అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేరుతో అడ్డదిడ్డమైన ప్రోడక్స్ట్ ని పరిచయం చేస్తున్నవారందరూ ఇకపై కాస్త ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రకటనలపై వినియోగదారుల శాఖ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. తప్పుడు ప్రచారాలు, వినియోగదారుల్ని మాటలతో బురిడీ కొట్టించడం.. ఇకపై కాస్తయినా తగ్గితే ఈ మార్గదర్శకాలతో ఉపయోగం ఉంటుంది .

First Published:  7 March 2023 1:54 AM GMT
Next Story