Telugu Global
National

ఆఫ్తాబ్, శ్రద్ధ.. మధ్యలో అతడు.. కేసులో కొత్త ట్విస్ట్

2022 మే-17న శ్రద్ధా వాకర్ తన స్నేహితుడిని కలిసేందుకు గురుగ్రామ్ వెళ్లింది. ఆ తర్వాతి రోజు తిరిగి ఇంటికి వచ్చింది. ఆరోజంతా ఎక్కడికి వెళ్లావు, ఎవర్ని కలిశావంటూ ఆఫ్తాబ్ గొడవ చేశాడు. ఆమెను తీవ్రంగా హింసించాడు.

ఆఫ్తాబ్, శ్రద్ధ.. మధ్యలో అతడు.. కేసులో కొత్త ట్విస్ట్
X

ప్రియురాలు శ్రద్ధా వాకర్ ని హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాయం చేసిన కేసులో ప్రియుడు ఆఫ్తాబ్ మరో కొత్త విషయం బయటపెట్టాడు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 6,636 పేజీల ఛార్జిషీట్‌ ను దాఖలు చేసిన పోలీసులు.. స్నేహితుడిని కలవడానికి వెళ్లిందనే కోపంతో తన ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ ను ఆఫ్తాబ్ పూనావాలా హత్య చేశాడని తెలిపారు. ఇప్పుడీ కేసులో ఆ స్నేహితుడి వ్యవహారం కీలకంగా మారింది. ఎవరా స్నేహితుడు, శ్రద్ధా వాకర్ హత్య తర్వాత అతను ఎందుకు బయటపడలేదు అనే విషయంలో కూడా విచారణ చేపట్టారు ఢిల్లీ పోలీసులు.

సహజీవనం చేస్తున్నా కూడా శ్రద్ధా వాకర్ పై పూర్తిగా పెత్తనం చలాయించేవాడు ఆఫ్తాబ్. ఆమె సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టేవాడు, అన్ని పాస్ వర్డ్స్ కూడా తెలుసుకున్నాడు. ఆఫ్తాబ్ దాడులపై గతంలో కూడా శ్రద్ధా పోలీసులను ఆశ్రయించినా, ఆ తర్వాత కేసు వెనక్కు తీసుకుంది. అయితే అతడు తనను హత్య చేసేందుకు కూడా తెగిస్తాడని మాత్రం ఊహించలేకపోయింది.

ఆరోజు ఏం జరిగింది..?

2022 మే-17న శ్రద్ధా వాకర్ తన స్నేహితుడిని కలిసేందుకు గురుగ్రామ్ వెళ్లింది. ఆ తర్వాతి రోజు తిరిగి ఇంటికి వచ్చింది. ఆరోజంతా ఎక్కడికి వెళ్లావు, ఎవర్ని కలిశావంటూ ఆఫ్తాబ్ గొడవ చేశాడు. ఆమెను తీవ్రంగా హింసించాడు. ఆ తర్వాత హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. రోజుకు కొన్ని ముక్కలు బయట పడేస్తూ వచ్చాడు. చివరకు పోలీసులకు దొరికాడు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్‌ లో 100 సాక్ష్యాలను పొందుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఫ్తాబ్‌ను కోర్టుకు హాజరు పరిచారు. అతడి జ్యుడీషియల్ కస్టడీని ఫిబ్రవరి 7 వరకు కోర్టు పొడిగించింది.

కొత్త నాటకమా..?

తమ మధ్యలో మూడో మనిషి ఉన్నాడని, అతడిని కలిసేందుకు వెళ్లడం వల్లే కోపంతో తాను శ్రద్ధాని హత్య చేశానని చెబుతున్నాడు ఆఫ్తాబ్. అయితే ఆఫ్తాబ్ సింపతీ కోసమే ఇలా చెబుతున్నాడా అనే విషయంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఆఫ్తాబ్ చెప్పిన దాంట్లో నిజం ఉందని రూఢీ చేసుకున్న తర్వాతే చార్జ్ షీట్ లో ఆ విషయాన్ని పొందుపరిచారు. ఆ వ్యవహారంపై మరింత లోతుగా పరిశోధిస్తున్నారు.

First Published:  25 Jan 2023 7:36 AM IST
Next Story