Telugu Global
National

విపక్షాలే టార్గెట్... ఒకే ఐపీ అడ్రస్ తో 23 నకిలీ వెబ్ సైట్లు, వందలాది ఎఫ్బీ పేజీలు...బీజేపీ వ్యవహారాన్ని బహిర్గతపర్చిన ఆల్ట్ న్యూస్

'ఆల్ట్ న్యూస్'అనే ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ఇప్పుడు బహిర్గత పర్చిన విషయాలు దిగ్భ్రాంతిని కలగజేస్తున్నాయి. ఒకే ఐపీ అడ్రస్ తో అనేక వెబ్ సైట్లను నడుపుతూ, వందలకొద్దీ ఫేస్ బుక్ పేజీలను సృష్టించి, ఫేస్ బుక్ లో లక్షలాది రూపాయల యాడ్స్ ఇచ్చి ప్రతిపక్షాలపై బీజేపీ అబద్దపు ప్రచారానికి పాల్పడుతోందని 'ఆల్ట్ న్యూస్' పరిశోధనలో తేలింది.

విపక్షాలే టార్గెట్... ఒకే ఐపీ అడ్రస్ తో 23 నకిలీ వెబ్ సైట్లు, వందలాది ఎఫ్బీ పేజీలు...బీజేపీ వ్యవహారాన్ని బహిర్గతపర్చిన ఆల్ట్ న్యూస్
X

దేన్నైనా పదే పదే ప్రచారం చేయడం ద్వారా నిజాన్ని అబద్దంగా, అబద్దాన్ని నిజంగా నమ్మించవచ్చని గోబెల్స్ సిద్దాంతం. అదే సిద్దాంతాన్ని భారత దేశంలో చాలా రాజకీయ పార్టీలు, నేతలు వంటపట్టించుకున్నారు. ఒక దుర్మార్గమైన పని చేసి, అవతలి పక్షమే చేసిందని బట్ట కాల్చి మీదేసే ఇంద్రజాల , మహేంద్రజాల విద్యలో పలువురు రాజకీయ నాయకులు ఆరితేరారు.

'ఆల్ట్ న్యూస్'అనే ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ఇప్పుడు బహిర్గత పర్చిన విషయాలు దిగ్భ్రాంతిని కలగజేస్తున్నాయి. ఒకే ఐపీ అడ్రస్ తో అనేక వెబ్ సైట్లను నడుపుతూ, వందలకొద్దీ ఫేస్ బుక్ పేజీలను సృష్టించి, ఫేస్ బుక్ లో లక్షలాది రూపాయల యాడ్స్ ఇచ్చి ప్రతిపక్షాలపై బీజేపీ అబద్దపు ప్రచారానికి పాల్పడుతోందని 'ఆల్ట్ న్యూస్' పరిశోధనలో తేలింది.

ఆ నకిలీ వెబ్ సైట్, ఫేస్ బుక్ పేజీల్లో తెలంగాణ నుంచి నడుస్తున్న 'తెలంగాణ ఆత్మగౌరవం.కామ్' ఒకటి. ఆ పేజ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం, బీఆరెస్ పార్టీపై పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు జరుగుతున్నట్టు 'ఆల్ట్ న్యూస్' గుర్తించింది. అదే విధంగా అసత్యాలు, అర్ద సత్యాలతో బీజేపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నట్టు కూడా తేలింది.

కొన్ని వెబ్‌సైట్‌లు ఒకేలా ఉన్నాయని, వాటి డొమైన్ పేరు మినహా వాటి కంటెంట్ ఒకే విధంగా ఉంటుందని ఆల్ట్ న్యూస్ సమాచారం అందుకుంది. ఈ వెబ్‌సైట్‌లు ఒకే IP చిరునామాలో హోస్ట్ చేయబడ్డాయి. ఈ వెబ్‌సైట్‌లకు లింక్ చేయబడిన ఫేస్‌బుక్ పేజీలకు భారీ ఫాలోయింగ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా అవి బీజేపీ అనుకూల ప్రచారాన్ని ప్రసారం చేస్తాయి. ఫేస్‌బుక్ ప్రకటనల కోసం పేజీలు లక్షల రూపాయలను ఖర్చు చేస్తాయి అని తెలుసుకున్న ఆల్ట్ న్యూస్ బృందం వీటిపై పరిశోధన ప్రారంభించింది.

ఆ బృందం పరిశోధన మొదలు పెట్టిన మొదటి వెబ్ సైట్, ఫేస్ బుక్ పేజ్ ‘phirekbaarmodisarkar.com’.

ఈ వెబ్ సైట్ IP అడ్రస్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించడానికి ఆల్ట్ న్యూస్ రివర్స్ IP లుక్అప్ సాధనాన్ని ఉపయోగించింది. దాంతో అదే IP అడ్రస్ (13.232.63.153)లో మొత్తం 23 వెబ్‌సైట్‌లు హోస్ట్ చేయబడినట్లు కనుగొన్నారు

ఈ వెబ్‌సైట్‌ల డొమైన్‌ల గురించి సమాచారాన్ని సేకరించడానికి ఆల్ట్ న్యూస్ ప్రయత్నించినప్పుడు, ఈ డొమైన్‌లన్నింటికీ సంబంధించిన సమాచారం రహస్యంగా ఉంచారని కనుగొన్నారు.

వీటికి సంబంధించిన ఫేస్‌బుక్ పేజీలు ఫేస్‌బుక్ ప్రకటనల కోసం లక్షల రూపాయలను విచక్షణారహితంగా ఖర్చు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించగా ఈ వెబ్‌సైట్‌లకు లింక్ చేయబడిన ఫేస్ బుక్ పేజీలు ఇప్పటివరకు మొత్తం 48,930 ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా మొత్తం 3,47,05,292 రూపాయలు ఖర్చు చేశాయి.

ఈ వెబ్‌సైట్‌లు తరచుగా BJPకి మద్దతుగా ప్రకటనలను ఇస్తాయి. వీటిలో చాలా వెబ్‌సైట్లు, వాటి అనుబంధిత ఫేస్ బుక్ పేజీలు ప్రతిపక్ష పార్టీలు, నాయకులపై వ్యతిరేక ప్రచారం చేయడానికి అంకితం చేయబడ్డాయి. అందులో తెలంగాణ ఆత్మగౌరవం అనే పేజీ 4,287 యాడ్స్ కోసం 17,93,141 రూపాయలను ఖర్చు చేసింది.

తప్పుడు సమాచారంతో ఇచ్చిన యాడ్స్ కు మంచి ఉదహరణ... ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే ఫేస్‌బుక్ పేజీ మార్చి 16 , 18, 2023 మధ్య ఒక ప్రకటనను ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోడీ నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారుగా ఉన్నారని నోబెల్ కమిటీ వైస్-ఛైర్మెన్ అస్లే టోజే చెప్పినట్టు తప్పుడు సమాచారంతో యాడ్ ఇచ్చారు. ఈ తప్పుడు సమాచారాన్ని మిగతా ఫేస్ బుక్ పేజీలలో కూడా ప్రచారం చేశారు.

ఈ పేజీల్లో బీజేపీ అనుకూల ప్రచారపు ప్రకటనలు, ప్రతిపక్ష పార్టీలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని కంటెంట్‌ను పోస్ట్ చేశారు. ఈ పేజీ ఇచ్చే ప్రకటనలలో బీఆరెస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాహుల్ గాంధీ,మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, తేజస్వీ యాదవ్ తదితర ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని ఆల్ట్ న్యూస్ పేర్కొంది.

ఈ వెబ్ సైట్లు ఏ అడ్రస్ నుండి కొనుగోలు చేశారు, యాడ్ లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ఆల్ట్ న్యూస్ 'ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్' ఫేస్‌బుక్ పేజీ 2019లో పోస్ట్ చేసిన ప్రకటన ఆధారంగా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో విజయం సాధించింది ఆల్ట్ న్యూస్ ఆ అడ్రస్... ''6 – ఎ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్, ITO సమీపంలో, మింటో బ్రిడ్జ్ కాలనీ, బరాఖంబ, న్యూఢిల్లీ, ఇండియా 110002'' ఈ అడ్రస్ BJP ప్రధాన కార్యాలయానిది.

ఇక మరొక ముఖ్యమైన విషయం ఈ ఫేస్ బుక్ పేజీల్లో యాడ్స్ ఫేస్ బుక్ అడ్వర్టైజింగ్ పాలసీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా ఫేస్ బుక్ ఆమోదించింది. ఒక ప్రకటనకు డబ్బులు ఎవరు చెల్లించారో చెల్లించిన వారి పేరు లేదా సంస్థ పేరు, పూర్తి అడ్రస్ ఉండాలి.

అయితే ఈ పేజీల ద్వారా సమర్పించబడిన చిరునామాలను నిశితంగా పరిశీలిస్తే, కొన్ని చిరునామాలు అసంపూర్ణంగా ఉన్నాయి. అందులో నగరం, రాష్ట్రం పేరు మాత్రమే ఉన్నాయి. అసంపూర్ణ సమాచారం ఉన్నప్పటికీ ఫేస్ బుక్ వీటికి ఆమోదం తెలిపింది. దీంతో వారు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకుండా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆల్ట్ న్యూస్ పేర్కొంది.


ఒక్కో ఫేస్ బుక్ పేజ్ యాడ్స్ పై పెట్టిన ఖర్చు వివరాలు...





First Published:  5 April 2023 9:00 AM IST
Next Story