Telugu Global
National

'చారిత్రక అబద్దాలు'... లేని చరిత్రను ఆవిష్కరిస్తున్న ప్రధాని, కేంద్ర మంత్రి

కశ్మీర్ భారత్ లో చేరడానికి ఆలస్యం చేసింది మహరాజా హరిసింగ్ కాదని, అప్పటి ప్రధాని నెహ్రూయేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు తేల్చేశారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా వక్కాణించారు.

చారిత్రక అబద్దాలు... లేని చరిత్రను ఆవిష్కరిస్తున్న ప్రధాని, కేంద్ర మంత్రి
X

చరిత్రను తమకనుగుణంగా మార్చడంలో ఆరెస్సెస్, బీజేపీకి మించినవాళ్ళు లేరు. లేనిది ఉన్నట్టు, జరిగింది జరగనట్టు చెప్తూ జనాల బ్రెయిన్ వాష్ చేయడం వాళ్ళు అనుసరిస్తున్న విద్య. ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా అదే చేస్తున్నారు. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడం కోసం నెహ్రూను విమర్శించడం బీజేపీ నాయకులు కొంత కాలంగా ప్రణాళికా బద్దంగా అనుసరిస్తున్న విధానం.

భారత దేశంలో ఇప్పుడున్న అధిక ధరలకు, నిరుద్యోగానికి, ఇంకా అనేక సమస్యలకు నెహ్రూనే కారణమని ఏ మాత్రం మొహమాటంలేకుండా చెప్తూ ఉంటారు బీజేపీ నాయకులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్లనే కష్టాలన్నీ వచ్చాయని అందువల్ల రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆరే అసలు దోషి అని వక్కాణించిన బీజేపీ నాయకులు కూడా ఉన్నారు.

ఇప్పుడు కశ్మీర్ గురించి తనకు మాత్రమే తెలిసిన ఓ కొత్త చరిత్రను కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఆవిష్కరించారు. కశ్మీర్ సమస్యకు కారణం నెహ్రూనే అని తేల్చి పడేశారు.

కశ్మీర్ గురించి కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ వరుస ట్వీట్‌లను చేయడంతో ట్విట్టర్‌లో బీజేపీ నాయకులు దుమారం మొదలు పెట్టారు. ఇంతకూ జైరాం రమేశ్ ఏం చెప్పారంటే...

"మహారాజా హరి సింగ్ కశ్మీర్ భారత్ లో చేరికపై ముందు ఒప్పుకోలేదు. ఆయన కశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని కలలు కన్నాడు. కానీ కశ్మీర్ పై పాకిస్తాన్ దాడి చేయడంతో హరి సింగ్ తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశంలో చేరడానికి ఒప్పుకున్నారు. నెహ్రూతో షేక్ అబ్దుల్లాకు ఉన్న స్నేహం, గాంధీ పట్ల ఆయనకున్న గౌరవం కారణంగా భారతదేశంలో పూర్తిగా విలీనాన్ని ఆయన సమర్థించారు.'' అని జైరాం రమేశ్ ట్విట్ చేశారు.

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు... కాశ్మీర్ భారత్ లో విలీనమవడాన్ని ఆలస్యం చేసింది మహారాజా హరిసింగ్ కాదని, జవహర్‌లాల్ నెహ్రూనే దానికి కారణమని అన్నారు.

"స్వాతంత్య్రానికి నెల రోజుల ముందు జులై 1947లోనే తొలిసారిగా కశ్మీర్ ను భారత్ లో కలిపేందుకు మహారాజా హరిసింగ్ నెహ్రూను సంప్రదించారు. అయితే మహారాజు ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారు. ఇతర రాష్ట్రాలను భారత్ లో కలుపుకున్నారు కానీ కాశ్మీర్ ను కలుపుకోలేదు." అని రిజిజు అన్నారు.

రిజిజు ఇలా మాట్లాడిన రోజుకన్నా ఒక రోజు ముందు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే మాట మాట్లాడారు. గుజరాత్‌లో జరిగిన ఓ ర్యాలీలో, దేశంలో ఇతర రాచరిక రాజ్యాలను భారత్ లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విజయవంతం అయ్యారు. కానీ "ఒక వ్యక్తి" కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయారని, జవహర్‌లాల్ నెహ్రూను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు.

ఇప్పుడు నెహ్రూ లేరు, మహారాజా హరిసింగ్ లేరు, వల్లబ్ బాయ్ పటేల్ కూడా లేరు. అయితే అప్పుడు జరిగిన విషయాలను చరిత్రకారులు రాసి పెట్టి ఉన్నారు. అలా జరిగిన చరిత్రను తమ రాజకీయ అవసరాల కోసం మార్చేసి బీజేపీ నాయకులు ఎవరిని నమ్మించదల్చుకున్నారు? కశ్మీర్ ప్రజలెలాగూ నమ్మరు. కానీ కశ్మీర్ సెంటిమెంటును రెచ్చగొట్టి ఇతర రాష్ట్రాల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసం ఈ 'చారిత్రక అబద్దాలు' బాగానే పనికి వస్తాయి.

First Published:  13 Oct 2022 1:00 PM IST
Next Story