Telugu Global
National

తల్లిదండ్రులను విస్మరిస్తే ఆస్తి వెనక్కి..! మద్రాస్‌ హైకోర్ట్‌

వృద్ధులు లేదా తల్లిదండ్రుల పట్ల ఉదాసీనతను ప్రదర్శించినప్పుడు, వారికి భద్రత కల్పించనప్పుడు, వారి గౌరవాన్ని కాపాడనప్పుడు, ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు.

తల్లిదండ్రులను విస్మరిస్తే ఆస్తి వెనక్కి..! మద్రాస్‌ హైకోర్ట్‌
X

బాధ్యతను విస్మరించి, ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే సంతానానికి మద్రాస్‌ హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకోవచ్చునని సంచలన తీర్పు వెలువరించింది.

పిల్లల ప్రయోజనం కోసం ప్రేమ, ఆత్మీయతలతో తాము ఆస్తిని ఇస్తున్నట్లు తల్లిదండ్రులు ఆ సెటిల్‌మెంట్‌ దస్తావేజులో పేర్కొంటే చాలునని, ఈ విధంగా పేర్కొనడమే తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంలోని నిబంధనలను సంతృప్తిపరుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. గిఫ్ట్‌ డీడ్‌ను లేదా సెటిల్‌మెంట్‌ దస్తావేజును రాయడానికి ప్రతిఫలం ప్రేమ, ఆత్మీయతలేనని, ఇవి పంచ‌డంలో ఉల్లంఘనలు జరిగితే ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. వృద్ధ తల్లిదండ్రుల పట్ల మానవీయ ప్రవర్తనను పరిశీలించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. వృద్ధులు లేదా తల్లిదండ్రుల పట్ల ఉదాసీనతను ప్రదర్శించినప్పుడు, వారికి భద్రత కల్పించనప్పుడు, వారి గౌరవాన్ని కాపాడనప్పుడు, ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు.

కేసు వివరాల్లోకి వెళితే..

షకీరా బేగం తన కుమారుడు మహమ్మద్‌ దయాన్‌ పేరున కొంత ఆస్తిని రాశారు. అయితే కుమారుడు తన బాగోగులను పట్టించుకోకపోవడంతో ఆమె తిరుప్పూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ను కలిసి కారణం చెప్పి తాను రాసిన సెటిల్‌మెంట్‌ డీడ్‌ను రద్దు చేయాలని కోరారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఈ డీడ్‌ను రద్దు చేశారు. అయితే దీన్ని మహమ్మద్‌ దయాన్‌ సవాల్‌ చేశారు. తన తల్లి సెటిల్‌మెంట్‌ డీడ్‌ను ఎటువంటి షరతులు లేకుండా రాశారని తెలిపారు. అయితే దయాన్‌ వాదనలను జస్టిస్‌ సుబ్రహ్మణ్యం తోసిపుచ్చారు. తల్లిదండ్రులకు ఇంత వండిపెట్టి, షెల్టర్ ఇస్తే సరిపోదని, ఆస్తి తీసుకున్నందుకు ప్రతిఫలంగా ప్రేమ, ఆప్యాయతలు వెనక్కి ఇవ్వడంలో ఉల్లంఘన జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చంటూ సంచలన తీర్పు ఇచ్చారు.

First Published:  11 Sept 2023 5:38 AM GMT
Next Story