నీట్‌లో అవకతవకలపై ఎన్టీఏను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
'పరీక్షను నిర్వహించే సంస్థగా మీరు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.. ఒకవేళ తప్పు జరిగితే ఒప్పుకోండి.. అప్పుడు మేం చర్యలు తీసుకుంటాం.. '
నీట్ –2024 పరీక్షకు సంబంధించిన అవకతవకలు బయటపడిన నేపథ్యంలో దానిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్టీఏ బాధ్యత కలిగిన సంస్థగా పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తప్పు జరిగితే దానిని అంగీకరించి.. వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది.
నీట్ పరీక్ష కోసం పిల్లలు కఠోర శ్రమతో సిద్ధమయ్యారని, వారి శ్రమను మనం వృథా చేయొద్దని ధర్మాసనం పేర్కొంది. 'పరీక్షను నిర్వహించే సంస్థగా మీరు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.. ఒకవేళ తప్పు జరిగితే ఒప్పుకోండి.. అప్పుడు మేం చర్యలు తీసుకుంటాం.. కనీసం ఇలాగైనా పని తీరు మెరుగుపడేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుందేమో'.. అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అవడం.. సమాజానికి హానికరమని ధర్మాసనం తెలిపింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ.. విద్యార్థుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపింది. ఏదైనా తప్పిదం ఉంటే వెంటనే సరిచేయాలని పేర్కొంది. నీట్ పరీక్ష వ్యవహారంలో 0.001 శాతం నిర్లక్ష్యం వహించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని ఎన్టీఏకు సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో ఎన్టీఏతో పాటు కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.