Telugu Global
National

`నీట్` రాకెట్‌ను ఛేదించిన ఢిల్లీ పోలీసులు.. - ప‌రీక్ష పేరుతో భారీ మోసం

విచారణలో ఈ గ్యాంగ్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేరే విద్యార్థులతో ప్రవేశ పరీక్ష రాయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7 లక్షలు వ‌సూలు చేస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

`నీట్` రాకెట్‌ను ఛేదించిన ఢిల్లీ పోలీసులు.. - ప‌రీక్ష పేరుతో భారీ మోసం
X

ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థులు న‌డిపిస్తున్న `నీట్` రాకెట్‌ను అక్క‌డి పోలీసులు ఛేదించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ముఠా నాయ‌కుడు స‌హా న‌లుగురు విద్యార్థుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో ఉత్తీర్ణ‌త సాధించేందుకు అస‌లైన అభ్య‌ర్థుల స్థానంలో న‌కిలీ వ్య‌క్తుల‌తో ఈ ముఠా ప‌రీక్ష రాయిస్తోంది.

డ‌బ్బు ఆశ చూపి ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌తో..

ఢిల్లీ ఎయిమ్స్‌లో రేడియాలజీ రెండో సంవత్సరం చదువుతున్న నరేశ్ బిప్రోయ్ అనే విద్యార్థి ఈ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. నీట్ పరీక్షలో అస‌లైన అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేయించి అత‌ను వారితో పరీక్ష రాయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బులు ఆశ చూపి అనేక మంది ఎయిమ్స్ విద్యార్థులను నిందితుడు తన ముఠాలో చేర్చుకున్నాడు. ఎక్కువగా ఎయిమ్స్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో నీట్ పరీక్ష రాయించేవాడు.

ముఠా స‌భ్యులు ప‌ట్టుబ‌డ‌టంతో రాకెట్ వెలుగులోకి..

ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో నరేశ్ ముఠాకు చెందిన పలువురు విద్యార్థులు ఇలా అస‌లైన అభ్య‌ర్థుల స్థానంలో ప‌రీక్ష రాస్తూ అధికారుల‌కు దొరికిపోయారు. ఎయిమ్స్‌లో రేడియాలజీ ఫ‌స్టియ‌ర్ విద్యార్థి సంజూ యాదవ్.. వేరే అభ్యర్థి స్థానంలో నీట్ పరీక్ష రాస్తుండ‌గా సిబ్బంది గుర్తించి ప‌ట్టుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని నాగూర్‌లో కూడా మ‌హ‌వీర్‌, జితేంద్ర అనే విద్యార్థులు ఇలాగే ప‌ట్టుబ‌డ్డారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. విచార‌ణ‌లో వారు ఈ ముఠా వివ‌రాలు వెల్ల‌డించారు. దీంతో పోలీసులు ఈ ముఠా నాయ‌కుడు న‌రేశ్‌ని త‌న రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష రాస్తుండ‌గా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

ఒక్కొక్కరితో రూ.7 ల‌క్ష‌ల‌కు డీల్‌..

విచారణలో ఈ గ్యాంగ్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేరే విద్యార్థులతో ప్రవేశ పరీక్ష రాయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7 లక్షలు వ‌సూలు చేస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. తొలుత ల‌క్ష రూపాయ‌లు అడ్వాన్స్ తీసుకొని ప‌రీక్ష రాసిన త‌ర్వాత రూ.6 ల‌క్ష‌లు తీసుకునేవార‌ని వెల్ల‌డైంది. ఈ ముఠాలో ఇంకా ఎంత‌మంది స‌భ్యులు ఉన్నార‌నే విష‌య‌మై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

First Published:  4 July 2023 1:54 PM IST
Next Story