ప్రాంతీయ భాషల్లోకి NDTV.. ఎన్నికల వేళ ప్రధానికి అదానీ మార్కు సాయం
ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో న్యూస్ ఛానెళ్లను మొదలుపెట్టబోతున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ వస్తున్న ఈ న్యూస్ ఛానళ్లు.. పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చేలా ప్రచారం చేసిపెడతాయనడంలో ఎలాంటి అనుమానం లేదు.
సార్వత్రిక ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ, అదానీ అధీనంలో ఉన్న NDTV వివిధ భాషల్లో 9 న్యూస్ ఛానళ్లు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కొత్తగా 9 న్యూస్ ఛానళ్లను ప్రారంభించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకోవాలనే ప్రతిపాదనకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత ఈ ఛానళ్ల ప్రారంభ తేదీని NDTV స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తుంది.
ఏయే ఛానళ్లు వస్తాయి..?
1. NDTV మలయాళం
2. NDTV తమిళం
3. NDTV కన్నడ
4. NDTV తెలుగు
5. NDTV రాజస్థాన్
6. NDTV మధ్యప్రదేశ్ /ఛత్తీస్ గఢ్
7. NDTV బంగ్లా
8. NDTV మహారాష్ట్ర
9. NDTV గుజరాత్
NDTV ప్రాఫిట్ ఛానల్ ని NDTV BQ ప్రైమ్ గా రీబ్రాండ్ చేశారు. దీన్ని పదో ఛానల్ గా లాంఛ్ చేస్తారు. ఇప్పటికే ఛానళ్ల ట్రేడ్ మార్క్ నమోదు ప్రక్రియ పూర్తయింది.
NDTVని సొంతం చేసుకున్న సమయంలోనే గౌతమ్ అదానీ విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేశారు. NDTVని గ్లోబల్ న్యూస్ ఆర్గనైజేషన్ గా మారుస్తామని ప్రకటించారాయన. అన్నట్టుగానే ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో న్యూస్ ఛానళ్లను మొదలుపెట్టబోతున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ వస్తున్న ఈ న్యూస్ ఛానళ్లు.. పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చేలా ప్రచారం చేసిపెడతాయనడంలో ఎలాంటి అనుమానం లేదు.