Telugu Global
National

మాతో చర్చించకుండానే వాటాల కొనుగోలు... అదానీ గ్రూప్ పై ప్రణయ్ రాయ్ ఫైర్

NDTVని టేకోవర్ చేయడానికి అదానీ ఆధ్వర్యంలోని విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన యత్నం తాలూకు ప్రకటన దిగ్భ్రాంతికి గురి చేస్తోందని NDTV యాజమాన్యం ప్రకటించింది. అసలు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది ఓ డొల్ల కంపెనీ అని, గత 14 ఏళ్లలో దీనికి ఎలాంటి ఆస్తులు లేవని.. అందువల్ల ఎన్డీటీవీ యాజమాన్యం దీంతో చర్చలు జరిపే అవసరమే లేదని అంటున్నారు.

మాతో చర్చించకుండానే వాటాల కొనుగోలు... అదానీ గ్రూప్ పై ప్రణయ్ రాయ్ ఫైర్
X

మీడియా రంగంలో అగ్ర స్థానంలో ఉన్న ఎన్డీటీవీలో కుబేరుడు అదానీ కాలు పెట్టడం పెను సంచలనమైంది. చడీచప్పుడు లేకుండా ఓ మీడియా సంస్థను టేకోవర్ చేయడానికి ఆయన ఆధ్వర్యంలోని గ్రూపు సంస్థ చేసిన యత్నం తాలూకు ప్రకటన దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తమ సంస్థలో అదానీ గ్రూప్ ఎంటరై దానికి అనుబంధంగా ఉన్న విశ్వ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 29.18 శాతం వాటాను పరోక్షంగా కొనుగోలు చేసినట్టు వచ్చిన ప్రకటన పట్ల ఎన్డీటీవీ యాజమాన్యం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది పరోక్షమే కావచ్చు.. కానీ మరో రెండు రోజుల్లో ఎన్డీటీవీ షేర్లలో తాము సుమారు 30 శాతం షేర్లను చేజిక్కించుకోగలమని ఈ సంస్థ ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించింది. రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ ఆర్ఫీ ఆర్హెచ్) పై కంట్రోల్ సాధించామని.. పైగా ఈ హోల్డింగ్ సంస్థకు చెందిన అన్ని ఈక్విటీ షేర్లను బదలాయించేందుకు రెండు రోజుల గడువునిచ్చామని విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన ప్రకటనను యాజమాన్యం తప్పు పట్టింది. ఓపెన్ ఆఫర్ కింద అదానీ గ్రూపు ఎన్డీటీవీలో మరో 26 శాతం షేర్లను కూడా కొనుగోలు చేస్తుందట.. అంటే దాదాపు మెజారిటీ షేర్ హోల్డర్ గా మారి.. ఎన్డీటీవీ ఫౌండర్ ప్రమోటర్లయిన రాధికా, ప్రణయ్ రాయ్ ల మీద పెత్తనం చెలాయించే ప్రయత్నమే ఇదంతా అన్న చర్చలు సాగుతున్నాయి.

దేశంలో టీవీ జర్నలిజంలో వీరికున్న పాపులారిటీ ఇంతాఅంతా కాదు. రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే అదానీ ఆద్వర్యంలోని విశ్వప్రధాన్ కమర్షియల్ సంస్థ ఈ ప్రకటన ఎలా చేసిందన్న ప్రశ్న తలెత్తుతోంది. 2009-10 ఆర్ధిక సంవత్సరంలో రాధికా రాయ్, ప్రణయ్ రాయ్, తమకు మధ్య ఓ రుణ ఒప్పందం కుదిరిందని, దాని ప్రకారం తాము పొందిన హక్కుల నేపథ్యంలో ఎన్డీటీవీ లో 29.18 శాతం వాటా కొనుగోలు చేసినట్టు విశ్వ ప్రధాన్ సంస్థ చెబుతోంది. ఈ ఒప్పందం మాట నిజమే అయినా తమకు మాట మాత్రమైనా చెప్పకుండా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఈ ప్రకటన ఎలా విడుదల చేశారని ఎన్డీటీవీ యాజమాన్యం అంటోంది. నిన్ననే తమకీ విషయం తెలిసిందని, అందువల్లే కంపెనీ ప్రమోటర్ల షేర్ హోల్డింగ్స్ లో ఎలాంటి మార్పు లేదనే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశామని స్పష్టం చేసింది.

ఎన్డీటీవీని అదానీ గ్రూపు టేకోవర్ చేయవచ్చునని దాదాపు ఏడాది కాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వీటిని గత ఏడాది సెప్టెంబరులో రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ కొట్టిపారేశారు. ఓనర్ షిప్ లేదా డైవెస్ట్ మెంట్ విషయాల్లో ఎలాంటి మార్పు లేదని ఎన్డీటీవీ యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. ఈ ఫౌండర్ ప్రమోటర్లకు కంపెనీలో 61.45 శాతం వాటా ఉందని, ఉంటుందని పేర్కొంది. అసలు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది ఓ డొల్ల కంపెనీ అని, గత 14 ఏళ్లలో దీనికి ఎలాంటి ఆస్తులు లేవని.. అందువల్ల ఎన్డీటీవీ యాజమాన్యం దీంతో చర్చలు జరిపే అవసరమే లేదని అంటున్నారు. ఏమైనా .. పీఎం మోడీకి సన్నిహితుడైన అదానీ.. తన పాచికలో భాగంగా ఎన్డీటీవీపై కన్నేశారని, అటు మోడీ కూడా 2024 లో జరిగే ఎన్నికల కోసం ఈ మీడియా సంస్థను వాడుకోవడం భేషుగ్గా ఉంటుందనే అంతా సవ్యంగా జరిగేలా చూశారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

మీడియాపై పెత్తనం కోసమే.. జైరాం రమేష్

స్వతంత్ర మీడియాను అణగ దొక్కేందుకే అదానీ గ్రూపు పరోక్షంగా ఎన్డీటీవీ షేర్లను కొనుగోలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఈ సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇదంతా మిస్టీరియస్ గా ఉందన్నారు . ఈ సందర్భంగా 'హమారే దో' అన్న పదాన్ని ప్రస్తావించారు. మోడీ, అదానీ మధ్య బంధం అందరికీ తెలిసిందేనన్నారు. 'ఖాస్ దోస్త్' లిద్దరూ ఏకమయ్యారన్నారు.





First Published:  24 Aug 2022 10:45 PM IST
Next Story