Telugu Global
National

అది ఎన్డీఏ వీడ్కోలు సమావేశం.. 'ఇండియా' నేతల సెటైర్లు

ఎన్డీఏ మీటింగ్ బలప్రదర్శనలాగా లేదని, వీడ్కోలు మీటింగ్ లా ఉందంటూ విపక్ష నేతలు చురకలంటించారు.

అది ఎన్డీఏ వీడ్కోలు సమావేశం.. ఇండియా నేతల సెటైర్లు
X

ఈ ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరిగింది. ఒకరకంగా విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయనే సంకేతాలు బలంగా రావడం, వరుస మీటింగ్ లతో కాంగ్రెస్ బలమైన కూటమికోసం ప్రయత్నించడంతో ఎన్డీఏ కూడా మీటింగ్ పెట్టి తమ బలం ఇదీ అని చూపించుకుంది. అయితే ఇది బలప్రదర్శనలాగా లేదని, వీడ్కోలు మీటింగ్ లా ఉందంటూ విపక్ష నేతలు చురకలంటించారు.

'ఇండియా' అని పేరు పెట్టుకున్న విపక్ష కూటమి కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. విపక్షాలు సమావేశం నిర్వహించిన రోజే బీజేపీ కూడా ఎన్డీయే సమావేశానికి పిలుపునివ్వడం ఆ పార్టీలో ఉన్న భయాన్ని తెలియజేస్తోందని అన్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. అది ‘ఇండియా’ తొలి విజయం అన్నారు. బీజేపీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగింది వీడ్కోలు సమావేశం అని కౌంటర్ ఇచ్చారాయన. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఇంటికెళ్లడం ఖాయమని చెప్పారు. ఎన్నికల తర్వాత ‘ఇండియా’ నేతృత్వంలోని భారత్‌ కొత్తపుంతలు తొక్కుతుందన్నారు.

కూటముల మాటల యుద్ధం..

ఇప్పటికే ఇరు కూటముల్లోని పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగారు. విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంపై బీజేపీ సెటైర్లు వేసింది. అది కూటమి కాదని, కుటుంబ రాజకీయాలకు నెలవు అని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఇటు ‘ఇండియా’ కూటమి నేతలు కూడా ఎన్డీఏపై విమర్శలు మొదలు పెట్టారు. అధికార కూటమిలో భయం మొదలైందని అంటున్నారు. అందుకే పాత మిత్రులందర్నీ కలుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఉనికిలో ఉన్నాయో లేవో కూడా తెలియని పార్టీలన్నీ ఎన్డీఏకు భాగస్వామ్య పక్షాలే అంటూ సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేతలు.

First Published:  20 July 2023 6:39 AM IST
Next Story