మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో విపక్షాల ఫైర్..
సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే.. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో నిరసన తెలిపాయి. `ఇండియా` ఫర్ మణిపూర్.. మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి.. అంటూ నినాదాలు చేశారు.
మణిపూర్ అంశంపై సోమవారం పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై చర్చకు తాము సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ.. చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి.
సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే.. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో నిరసన తెలిపాయి. `ఇండియా` ఫర్ మణిపూర్.. మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి.. అంటూ నినాదాలు చేశాయి. ఈ ఆందోళనలు ఎంతకీ ఆగకపోవడంతో ఉభయ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
మణిపూర్ అంశంపై రూల్ 176 కింద చర్చ జరపాలని 11 నోటీసులు, రూల్ 267 కింద చర్చ జరపాలని 27 నోటీసులు అందాయని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ వెల్లడించారు. ఒకపక్క విపక్షాలు మణిపూర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తుండగా బీజేపీ ఎంపీలు మాత్రం ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింసపై చర్చించాలంటూ నోటీసులు ఇచ్చారు.
ఈ క్రమంలో ఎగువ సభ సభ్యులను ఉద్దేశించి ధన్‌కడ్ మాట్లాడుతుండగా.. విపక్ష ఎంపీలు వారి సీట్లలో నుంచి లేచి నిలబడ్డారు. దీనిపై ధన్‌కడ్ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది. సభ కార్యకలాపాలకు ముందు అధికార, ప్రతిపక్ష పార్టీలు గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపాయి. 'మణిపుర్ అంశంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నా.. దేశంలో మాత్రం చర్చించే పరిస్థితి లేదు' అంటూ ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.