మోదీ జమానాలో.. మైనార్టీలకు పదవులు కష్టమేనా..?
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు దాదాపుగా ఖాయమైందని అనుకున్నారంతా. ఆయనతో కేంద్ర మంత్రి పదవికి సైతం రాజీనామా చేయించారు.

భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార ఎన్డీఏ జగ్ దీప్ ధనకర్ పేరు ఖరారు చేసింది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గవర్నర్ గా ఉన్న జగ్ దీప్ ధనకర్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. అయితే ఆయన ఎంపిక వెనక చాలా కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. ఓ దశలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు దాదాపుగా ఖాయమైందని అనుకున్నారంతా. ఆయనతో కేంద్ర మంత్రి పదవికి సైతం రాజీనామా చేయించారు. అయితే చివర్లో ఆ పేరు మిస్సైంది. కారణం ఆర్ఎస్ఎస్ అని వినపడుతోంది.
కేవలం ఆర్ఎస్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు వెనక్కి వెళ్లిపోయిందనే వాదన వినపడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడంతో వైరివర్గాలను కూడా తమవైపు తిప్పుకుంది బీజేపీ. అనూహ్యంగా కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మైనార్టీని నిలబెడితే అంతకంటే మించిన రాజకీయ వ్యూహం ఉండదని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ వ్యూహంపై బలమైన రాజకీయ ఒత్తిడిదే పైచేయిగా మారింది. మోదీ హయాంలో మైనార్టీలకు ఉన్నత పదవులు కష్టమేనంటూ అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి.
అధికార పార్టీ అభ్యర్థి జగ్ దీప్ ధన కర్ కి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అంతకు మించి అధిష్టానాన్ని ఎలా సంతృప్తి పరచాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే గవర్నర్ పోస్ట్ లో ఉండి కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కయ్యానికి కాలుదువ్వారు. గవర్నర్ వర్సెస్ సీఎం అనేంతగా అక్కడ రాజకీయం నడిచింది. మోదీ వ్యతిరేక శక్తులపై ఆయనకు ఉన్న వ్యతిరేక భావజాలం, పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆయనకు పెద్దపీట వేసేందుకు కారణమైందని అంటున్నారు.
ఇక రాష్ట్రపతి ఎన్నిక సోమవారం జరుగుతుంది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు దాదాపుగా లాంఛనమే అవుతోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈనెల 19తో ముగుస్తుంది. దీంతో చివరి వరకూ వేచి చూసి అభ్యర్థిని ఖరారు చేసింది ఎన్డీఏ. అధికార కూటమికే గెలుపు అవకాశాలుండటంతో ఏకగ్రీవం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏకగ్రీవం కాకపోతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్ట్ 6న జరుగుతుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగుస్తుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపడతారు.