Telugu Global
National

‘ఇండియా’ అంటే జడుపు ఎందుకు..?

ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ అనే పేరుతో ముందుకు రావడాన్ని జీర్ణించుకోలేని కాషాయ పరివారం సోషల్‌ మీడియాలో దాడులు మొదలు పెట్టింది.

‘ఇండియా’ అంటే జడుపు ఎందుకు..?
X

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడ‌మే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతిపక్షాలు ఒక కూటమిగా ఏర్పడటంలో మరో ముందడుగు వేశాయి. కూటమి పేరును యూపీఏ స్థానంలో ఐ.ఎన్‌.డీ.ఐ.ఏ (ఇండియా) గా స్థిరపరచడంతో కాషాయ వర్గాల నుంచి దాడులు మొదలయ్యాయి. భారత్‌ వర్సెస్‌ ఇండియా అనే మాటను తెరపైకి తెచ్చారు. పేదలది భారత్‌ అని, ఉన్నతవర్గాలది ఇండియా అంటున్నారు. కానీ, భారత్‌ అంటే ఇండియా, ఇండియా అంటే భారత్‌ అనే భావన స్థిరపడింది. భారత్‌, ఇండియా వేర్వేరు అని ఎవరూ తలపోయడం లేదు. శ్రేష్టవర్గాలది ఇండియా అని భాష్యం చెబితే నమ్మడానికి ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరు.

ముఖ్యంగా గత తొమ్మిదేళ్ళ పాలనలో ‘ఇండియా’ అనే పదాన్ని పదేపదే వల్లించింది కాషాయ పాలకులే. కానీ, ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ అనే పేరుతో ఒకటి కాగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘షైనింగ్‌ ఇండియా’ అనే నినాదాలని స్వయంగా ప్రచారం చేసింది బీజేపీ పాలకులే. కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ చెప్పినట్టు స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, టీమ్‌ ఇండియా అనే పేర్లను పదే పదే వల్లించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నమాట వాస్తవం.

ఇవన్నీ తెలిసినప్పటికీ ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ అనే పేరుతో ముందుకు రావడాన్ని జీర్ణించుకోలేని కాషాయ పరివారం సోషల్‌ మీడియాలో దాడులు మొదలు పెట్టింది. పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కానీ ‘ఇండియా’ అనే పేరుకు ట్యాగ్‌లైన్‌గా ‘జితేగీ భారత్‌’ అని జోడించడం ప్రతిపక్షాల కూటమికి మరింత బలం చేకూర్చింది.

ప్రతిపక్షాలలో కొందరికి ‘ఇండియా’ పేరు ఇష్టం లేదనే మాటని మరింతగా ప్రచారంలోకి తీసుకువస్తున్నది మోడీ అనుకూల మీడియా. ఐక్యత దిశగా పనిచేస్తున్న ప్రతిపక్షాల మధ్యనే అసంతృప్తులు, అభిప్రాయ భేదాలున్నాయని చెప్పడానికి మోడీ అనుకూల మీడియా కూట‌మి పేరు మీద వివాదాన్ని రాజేస్తున్నది.

అనేక పక్షాలు కలసి పని చేసేప్పుడు అభిప్రాయాలలో తేడాలు ఉండవచ్చు కానీ, ఒక ఆశయం దిశగా సాగిపోయే వారు మెజారిటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు సమ్మతి తెలిపి కార్యాచరణ దిశగా సాగిపోతారు. మెజారిటీ ఉన్న పార్టీల ప్రభుత్వాలను కూలదోసే సంఘ్‌ పరివార్‌కు ఈ ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం కాదు.

తొమ్మిదేళ్ళుగా ఎన్‌డీఏ సమావేశాలే నిర్వహించని బీజేపీ ఆకస్మికంగా ఎన్‌డీఏ కూట‌మి సమావేశం ఏర్పాటు చేయడమే చిత్రం. కూటమి స్ఫూర్తిని బీజేపీ ఎప్పుడూ అనుసరించలేదు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సహకారంతో లోక్‌సభలో మెజారిటీ సీట్లు సంపాదించిన బీజేపీ, ఆ తరువాత కాలంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలను ఏ విషయంలోనూ సంప్రదించలేదు. నిజానికి తనని నమ్మి జత కట్టిన పార్టీలని బలహీనపరచడానికి, విడగొట్టడానికి, పూర్తిగా నిర్వీర్యం చేసే కుతంత్రాలకు బీజేపీ పాల్పడింది. దీనిని సకాలంలో గుర్తించిన నితీష్‌కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన పార్టీని ఉనికిలో లేకుండా చేయడానికి అనుసరించిన కుటిల వ్యూహాలది ఇటీవలి చరిత్రే.

దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రతి దశలోనూ భాగస్వామ్య పక్షాలను సంప్రదిస్తూ వచ్చింది. కొన్ని సందర్భాలలో భాగస్వామ్య పార్టీల షరతులకు తలొగ్గి కూటమిని నిలబెట్టడానికి ప్రయత్నించింది. ఇప్పటికీ తనను తాను తగ్గించుకొని అనేక రాజకీయ పార్టీలతో జత కట్టడానికి సిద్ధమైంది. మోడీ నిరంకుశ పాలనను అంతం చేయాలన్న లక్ష్యంతో 26 పార్టీలతో కలిసి ‘ఇండియా’ కూటమి ఏర్పాటుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించింది. కనుకనే ‘ఇండియా’లో కాంగ్రెస్‌ కీలకమైన భాగస్వామ్యపక్షంగా ప్రజాస్వామిక స్ఫూర్తితో నిలబడింది.

38 పార్టీల ఎన్‌డీఏలో అనేక పార్టీలది కేవలం నామమాత్రపు పాత్రే. బీజేపీ పెద్దన్నగా వ్యవహరిస్తున్నది. మరోమాటలో చెప్పాలంటే ఎన్‌డీఏ అన్నది బీజేపీ నాయకత్వంలోని ఏకస్వామ్య కూటమి అన్నది చేదు నిజం. కనుకనే ఎన్‌డీఏ - ఐ.ఎన్‌.డీ.ఐ.ఏ పరస్పరం భిన్న కూటములు. మొదటి కూటమి ఆధిపత్యానికి ప్రతీక అయితే, రెండో కూటమి మన లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థల పటిష్టతకు సంకేతం. కనుకనే ‘ఇండియా’ పేరు వింటేనే బీజేపీ పరివారానికి గుబులు పుడుతుంది. పేరులో ఏముంది అనుకోలేక పేరు మీదనే యుద్ధం ప్రకటించారు. కనుకనే ఇది వారి బలాన్ని కాక బలహీనతని సూచిస్తున్నదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  19 July 2023 5:17 PM IST
Next Story