నోట్ల రద్దు ఓ విఫల ప్రయోగం.. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక
నోట్ల రద్దు తర్వాత 2021 వరకు దేశవ్యాప్తంగా రూ.245.33 కోట్ల విలువైన నకిలీ నోట్లను వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు NCRB నివేదిక స్పష్టం చేసింది
పెద్ద నోట్ల రద్దు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం ఎగిరెగిరి పడుతోంది. నోట్ల రద్దుని సుప్రీంకోర్టు సమర్థించింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమని సమాధానం చెబుతారంటూ హడావిడి చేస్తున్నారు బీజేపీ నేతలు. మోదీ భక్తులు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే వారి పరువు పోడానికి చంకలు గుద్దుకున్నంత సమయం పట్టలేదు. జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) విడుదల చేసిన తాజా నివేదిక కేంద్రం పరువు తీసింది. నోట్ల రద్దుతో ఏమాత్రం ప్రయోజనం లేదని తేల్చి చెప్పింది.
నోట్ల రద్దు తర్వాత బ్లాక్ మనీ పరిగెత్తుకుంటూ భారత్ కి తిరిగొస్తుందని ప్రచారం చేసుకున్నారు బీజేపీ నేతలు. నకిలీనోట్లు ఇక కనపడవని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు, మావోయిస్ట్ ల వద్ద ఉన్న డంప్ లకు విలువ లేకుండా పోతుందని, వారి ఆర్థిక మూలాలపై దెబ్బ పడుతుందని కూడా జబ్బలు చరుచుకున్నారు. ఇవేవీ జరగకపోగా సామాన్యుడు బ్యాంకుల ముందు క్యూలైన్లలో లాఠీ దెబ్బలు తిన్నాడు, ఏటీఎంల వద్ద అర్థరాత్రుల వరకూ పడిగాపులు పడ్డాడు, అమాయకుల ప్రాణాలు పోయాయి. పాతనోట్లను మార్పిడి చేసుకోలేని వృద్ధులు, నిస్సహాయులు ఆ తర్వాత లబోదిబోమన్నారు. ఇంత జరిగినా అది తమ ఘనత అని కేంద్రం చెప్పుకోవడం గమనార్హం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బీజేపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. ఈలోగా NCRB నివేదిక వాస్తవాల గుట్టు రట్టు చేసింది.
నకిలీ నోట్లు గుట్టలు గుట్టలు..
2016లో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కొత్త నోట్లను ప్రింట్ చేయడానికి కాస్త గ్యాప్ తీసుకున్నారు అక్రమార్కులు. గతంలో సెక్యూరిటీ కోడ్ ల విషయంలో అసలు నోట్లకు మ్యాచింగ్ కుదిరేది కాదేమో.. ఇప్పుడొచ్చిన కలర్ ఫుల్ నోట్లకు నకిలీ తయారు చేస్తే అసలు ఏదో, నకిలీ ఏదో తెలుసుకోవడం మరింత కష్టంగా మారింది. నోట్ల రద్దు తర్వాత 2021 వరకు దేశవ్యాప్తంగా రూ.245.33 కోట్ల విలువైన నకిలీ నోట్లను వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు NCRB నివేదిక స్పష్టం చేసింది. 2020లో అత్యథికంగా రూ.92.17 కోట్లు, 2016లో తొలి ఏడాది కాబట్టి కనిష్టంగా రూ.15.92 కోట్ల నకిలీ నోట్లు పట్టుబడినట్టు తెలిపింది.
2022 మే లో ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు గుర్తించిన నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 79,669 కాగా, నకిలీ రూ.2 వేల నోట్ల సంఖ్య 13,604. 2020-21తో పోలిస్తే తర్వాతి ఏడాది నకిలీ నోట్ల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం గమనార్హం. 2021-22లో గుర్తించిన అన్ని రకాల నకిలీ నోట్ల సంఖ్య 2,30,971. ఈ గణాంకాలన్నీ ఇప్పుడు కేంద్రాన్ని మరోసారి బోనులో నిలబెడుతున్నాయి. నోట్ల రద్దు నిర్ణయంలో తప్పు లేదు అనుకున్నా, దాని వల్ల ఒరిగిందేమీ లేదని తేలిపోయింది. పైగా దేశ ప్రజలంతా అష్టకష్టాలు పడ్డారు, అక్రమార్కులు మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చి మరీ నకిలీ నోట్లను జోరుగా అచ్చు గుద్దేస్తున్నారు.