Telugu Global
National

ఢిల్లీ ముందు లొంగిపోం, బీజేపీని గద్దె దించే దాకా నిద్రపోం : పవార్

ఢిల్లీ పాలకుల ముందు త‌మ పార్టీ ఎన్నటికీ లొంగిపోదు అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. బీజేపీని గద్దె దించేందుకు దేశంలోని పార్టీల‌న్నీ ఏకం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఢిల్లీ ముందు లొంగిపోం, బీజేపీని గద్దె దించే దాకా నిద్రపోం : పవార్
X

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడం, రైతుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రించ‌డంపై నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఎన్‌సిపి అధ్య‌క్షుడు శ‌ర‌ద్ పవార్ మండిపడ్డారు. ప్ర‌జా వ్య‌తిరేక విధాన‌ల‌తో సాగుతున్న బిజెపి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు పార్టీల‌న్నీ ఏకం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే విప‌క్షాలన్నీ ఒక తాటిపైకి వ‌చ్చి బిజెపిని సాగ‌నంపేందుకు సిద్ధ‌మ‌య్యాయ‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర సంస్థలైన ఈడీ, సీబీఐ, ధనబలాన్ని దుర్వినియోగం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా సవాలు చేయాలని, పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఎన్సీపీ జాతీయ కౌన్సిల్ స‌మావేశాల్లో ఆయ‌న మాట్లాడారు. పార్టీ అధ్య‌క్షుడిగా మ‌ళ్ళీ ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. రానున్న రోజుల్లో భారీ పోరాటానికి సిద్ధం కావాలని ఆయ‌న కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

"ఢిల్లీ పాలకుల ముందు త‌మ పార్టీ ఎన్నటికీ లొంగిపోదు" అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ఢిల్లీ పాలకుల ముందు ఛత్రపతి శివాజీ ఎన్నడూ తలవంచలేదని, ఎన్సీపీ కూడా ప్రగతిశీల జాతీయ పార్టీగా ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డుస్తుంద‌ని పవార్ అన్నారు.

స‌గ‌టు మ‌నిషికి ప్ర‌యోజ‌నం చేకూరేలా దేశ‌ప్ర‌యోజ‌నాల దృష్ట్యా బిజెపిని అధికారం నుంచి తొల‌గించేందుకు భావ‌సారూప్య పార్టీల‌తో క‌లిసి ముందుకు సాగుతామ‌ని ప‌వార్ చెప్పారు.

ఆదివారం ఎన్‌సిపి జాతీయ కౌన్సిల్ సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ శరద్ పవార్ ప్రధాని పదవికి పోటీదారు కాదని, ప్రతిపక్షాల ఐక్యతే ప్రధానమని అన్నారు.క్షేత్ర స్థాయిలో ప్రజ‌ల కోసం ప‌నిచేసే పార్టీ త‌మ‌ద‌ని అన్నారు. త‌మ‌ప‌రిమితులు త‌మ‌కు తెలుస‌న‌ని చెప్పారు.వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను, సిద్ధాంతాల‌ను ఏకంచేయ‌గ‌ల స‌మ‌ర్ద‌నాయ‌కుడు శ‌ర‌ద్ ప‌వార్ అని ప‌టేల్ చెప్పారు. ప‌వార్‌కు ప్రధాని ప‌ద‌వి ముఖ్యం కాద‌ని, విప‌క్షాల‌న్నీ ఏక‌మై అరాచ‌క బిజెపిని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని అన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, బిహార్‌ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ భావ‌సారూప్య గ‌ల‌పార్టీల మ‌ధ్య ఐక్య‌త సాదించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అన్నారు.

First Published:  12 Sept 2022 2:06 AM GMT
Next Story