Telugu Global
National

15 ఏళ్ల తర్వాత NDAలోకి బీజేడీ..

1998లో రెండు పార్టీల మధ్య పొత్తు పొడవగా.. 1998, 99, 2004 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్రపక్షంగా బీజేడీ కొనసాగింది.

15 ఏళ్ల తర్వాత NDAలోకి బీజేడీ..
X

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 400 లోక్‌సభ స్థానాల్లో విజయమే టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ.. ఆ దిశగా పావులు కదుపుతోంది. సొంతగా 370 స్థానాలు సాధించడంతో పాటు మిత్రపక్షాల ద్వారా మరో 30 సీట్లు కొట్టాలని టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ. ఇందులో భాగంగా పాతమిత్రులకు స్నేహహస్తం చాస్తోంది. 15 ఏళ్ల తర్వాత నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతా దళ్‌ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరబోతుందని సమాచారం. ఇందుకు ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు మరింత బలాన్నిస్తున్నాయి. ఇటీవల ఒడిశాలో పర్యటించిన మోడీ.. ఆ రాష్ట్రంలో 19 వేల 600 కోట్లకుపైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నవీన్‌ సర్కార్‌పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. నవీన్‌ పట్నాయక్ సైతం మోడీపై ప్రశంసలు కురిపించారు.

అయితే ఇప్పటివరకూ రెండు పార్టీల నుంచి పొత్తుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, అంతర్గతంగా చర్చలు జరిగినట్లు బీజేడీ ఉపాధ్యక్షుడు దేబి ప్రసాద్‌ ప్రకటించారు. అటు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ జుయల్ ఓరమ్ సైతం బీజేడీతో పొత్తుపై ఇటీవల నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామన్నారు. తుది నిర్ణయం కేంద్ర నాయకత్వానిదేనని ప్రకటించారు. కాగా, శుక్రవారం దీనిపై అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది.

1998లో రెండు పార్టీల మధ్య పొత్తు పొడవగా.. 1998, 99, 2004 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్రపక్షంగా బీజేడీ కొనసాగింది. కానీ, 2009లో సీట్ల పంపకాల విషయంలో విబేధాలు తలెత్తడంతో.. 2009 మార్చి 8న ఎన్డీఏ కూటమి నుంచి బయటకువచ్చేసింది బీజేడీ. ఐనప్పటికీ.. అవసరమైన టైమ్‌లో రెండు పార్టీలు సహకరించుకున్నాయి. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడంతో బీజేడీ మద్దతిస్తూ వచ్చింది.

ఇక ఒడిశాలో 21 పార్లమెంట్ స్థానాలుండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ ఒక్క స్థానానికి పరిమితమైంది. 2019లో 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా..బీజేడీ - 113, బీజేపీ - 23, కాంగ్రెస్‌ 9 స్థానాలు గెలుచుకున్నాయి.

First Published:  7 March 2024 5:50 AM GMT
Next Story