Telugu Global
National

అందరికీ కావాలి 'నాటు నాటు'

ముందుగా కాంగ్రెస్ పార్టీ నాటు నాటు పోస్టర్ పై ఎన్టీఆర్, చరణ్ ఫొటోల స్థానంలో అదానీ, మోడీ ఫొటోలు పెట్టి లూటో లూటో అనే కామెంట్స్ చేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

అందరికీ కావాలి నాటు నాటు
X

ఆర్ఆర్ఆర్ మూవీలో చంద్రబోస్ రచించి.. కీరవాణి మ్యూజిక్ అందించిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు ఫీవర్ పట్టుకుంది. సోషల్ మీడియాలో, టీవీల్లో ఎక్కడ చూసినా నాటు నాటు పాట గురించి చర్చ జరుగుతోంది. అమెరికాకు చెందిన వందలాది మంది పోలీసులు నాటు నాటు పాటకు సామూహికంగా డ్యాన్సులు వేశారు. ఇక ప్రతి ఒక్కరూ నాటు నాటు పాటను తమకు అనుకూలంగా వాడుకుని ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముందుగా కాంగ్రెస్ పార్టీ నాటు నాటు పోస్టర్ పై ఎన్టీఆర్, చరణ్ ఫొటోల స్థానంలో అదానీ, మోడీ ఫొటోలు పెట్టి లూటో లూటో అనే కామెంట్స్ చేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దయచేసి నాటు నాటు పాటకు తమ వల్లే ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పుకోవద్దని బీజేపీ నేతలపై సెటైర్ వేశారు. ఈ సెటైర్ కూడా జనంలోకి వెళ్ళింది.

కాగా ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం కూడా నాటు నాటు పాటను తన ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. నాటు నాటు పాటలో ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ వేస్తున్న వీడియో బిట్ ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన పేటీఎం దాని కిందే నో టు యూపీఐ పేమెంట్స్ ఫెయిల్యూర్స్ అనే కామెంట్ పెట్టింది. నాటు నాటు పాటలో ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ లాగే పేటీఎంలో జరిపే లావాదేవీలు ఫెయిల్ కావని ప్రచారం చేసుకుంటోంది.

ఆర్ఆర్ఆర్ పేరుని తమిళనాడులోని సేలం జిల్లా ఎస్పీ శివకుమార్ కూడా వినియోగించుకున్నాడు. తాజాగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పోలీసులు 'ఆర్ (రెస్పెక్ట్), ఆర్ ( రికగ్నైషన్), ఆర్ (రెస్ట్) తో పనిచేయాలని సూచించారు. విధుల్లో ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగించాలని, ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని ఎక్కువసేపు వేచి ఉంచకుండా పంపించడంపై శ్రద్ధ చూపాలన్నారు. విధులు నిర్వహించడంతోపాటు తగిన విశ్రాంతి తీసుకోవాలని ఎస్పీ పోలీసులకు సూచించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మూవీ, నాటు నాటు పాట గురించి ప్రస్తావనే కనిపిస్తోంది.

First Published:  15 March 2023 1:03 PM IST
Next Story