Telugu Global
National

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా.. జెండాపై నిర్లక్ష్యం..

తెల్ల పేపర్ పై జాతీయ జెండాని కలర్ ప్రింట్ తీసుకుని ఇంటి గోడపై అంటించాలట. స్వతంత్ర భారత దేశ జెండా గురించి ఓ కేంద్రమంత్రి ఇంతకంటే దిగజారి మాట్లాడటం ఇక సాధ్యం కాదేమో.

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా.. జెండాపై నిర్లక్ష్యం..
X

1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. పాతికేళ్ల ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసు, యాభయ్యేళ్ల స్వర్ణోత్సవ సంవత్సరం ఎప్పుడో ముందే తెలుసు, వజ్రోత్సవాలు ఎప్పుడో కూడా ముందుగానే ఓ అవగాహన ఉంటుంది. 2019లో రెండోసారి గద్దెనెక్కిన ఎన్డీఏ ప్రభుత్వం 2024వరకు అధికారంలో ఉంటుంది. అంటే 2022లో వచ్చే వజ్రోత్సవాలు కూడా వారి హయాంలోనే జరుగుతాయి. ఇదేమీ దుర్భిణి వేసి శోధించాల్సిన అంశం కాదు. అన్నీ తెలిసినా జాతీయ జెండాల తయారీలో కేంద్రం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోందనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం. ఆమధ్య జాతీయ జెండాలను చైనా నుంచి దిగుమతి చేసుకునేందుకు అనుమతిచ్చిన కేంద్రం అభాసుపాలైంది. అలా దిగుమతి చేసుకున్నా ప్రతి ఇంటికీ ఓ జెండా ఇచ్చేందుకు సరిపోలేదట. తీరా ఇప్పుడు కిషన్ రెడ్డి ఏం సెలవిస్తున్నారంటే తెల్ల పేపర్ పై జాతీయ జెండాని కలర్ ప్రింట్ తీసుకుని ఇంటి గోడపై అంటించాలట. స్వతంత్ర భారత దేశ జెండా గురించి ఓ కేంద్రమంత్రి ఇంతకంటే దిగజారి మాట్లాడటం ఇక సాధ్యం కాదేమో.

హర్ ఘర్ తిరంగా..

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనే కాన్సెప్ట్ తో హర్ ఘర్ తిరంగాని రూపొందించారు. పేరు ఘనంగా ఉంది. ఆ పేరుతో తీసిన వీడియోని సినీ తారలు, క్రీడాకారులతో ఘనంగానే చిత్రీకరించారు. అయితే ఆ ఘనత ఆచరణలో లేదు. కనీసం ప్రతి ఇంటికీ ఓ జాతీయ జెండాని కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం కేంద్రానిది. జాతీయ జెండా ఇవ్వలేకపోతున్నాం, జనాలే ఓ తెల్లపేపర్ పై జెండాని ప్రింట్ తీసి గోడకి అంటించుకోండి అని ఉచిత సలహా పారేశారు కిషన్ రెడ్డి.

కరెన్సీ నోట్లు కూడా ప్రింట్ తీసుకోవచ్చా..?

కిషన్ రెడ్డి వ్యాఖ్యలకి దారుణమైన కౌంటర్లు పడుతున్నాయి. 2022లో వజ్రోత్సవాలు జరుపుకోవాలనే విషయం ఇప్పటికిప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాతయినా 2022లో అధికారంలో ఎవరు ఉంటారో, వజ్రోత్సవాలకోసం ఏం చేయాలో అనేది ఆలోచించుకోవాలి కదా అంటున్నారు నెటిజన్లు. జెండాలు ప్రింట్ చేసుకోండి అని చెప్పినట్టే, కరెన్సీ నోట్లు కూడా ప్రింట్ తీసుకోవాలని సలహా ఇస్తారేమో అని కామెడీ చేస్తున్నారు. కనీసం ఇంటికో జాతీయ జెండా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం మీది అని మండిపడుతున్నారు. జాతీయ జెండా అంత చులకన అయిందా అని అంటున్నారు.

First Published:  8 Aug 2022 2:44 PM GMT
Next Story