రవి విజ్ఞత కోల్పోయారు - తమిళనాడు గవర్నర్ పై నేషనల్ మీడియా
రవి ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. జాతీయ మీడియా సంస్థలు కూడా గవర్నర్ రవిపై విరుచుకుపడుతున్నాయి.
తమ భాష, తమ సంస్కృతి, తమ ఆత్మ గౌరవం విషయంలో తమిళ ప్రజలు ఏమాత్రం రాజీపడరన్న ఖ్యాతి ఉంది. బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నాలు జరిగిన సమయంలో తమిళ ప్రతిఘటన దేశాన్ని అబ్బురపరిచింది. అలాంటి తమిళనాడుతో ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం గవర్నర్ రవి ద్వారా కయ్యం పెట్టుకుంటోంది.
గవర్నర్ చేత తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేయిస్తోంది. ఎవరి ఊహకు అందని స్థాయిలో రవి మాటల అవహేళనగా ఉండటం తమిళ ప్రజల ఆగ్రహాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తోంది. తమిళ దేశం అని అర్థం వచ్చేలా ఉన్న తమిళనాడు పేరుని తమిళగం అని మార్చాలంటూ బహిరంగంగానే రవి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తన ఆమోదంతోనే తన ముందుంచిన ప్రసంగంలోనూ ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు అన్న పేరును కూడా ఆయన విస్మరించారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిలబడకండి.. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వినండి అంటూ ఐఏఎస్ లకు ఆయన సూచనలు చేశారు.
రవి ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. జాతీయ మీడియా సంస్థలు కూడా గవర్నర్ రవిపై విరుచుకుపడుతున్నాయి. విజ్ఞత కోల్పోయిన గవర్నర్ కారణంగా దేశంలో కొత్త వివాదాలు తలెత్తే అవకాశం ఏర్పడుతోందని జాతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది.
గవర్నర్ ప్రసంగంలో చోటుచేసుకున్న మార్పులను గుర్తించిన ముఖ్యమంత్రి స్టాలిన్ దానిపై అభ్యంతరం తెలిపారని.. ఆ మాత్రం దానికే గవర్నర్ సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడం సరికాదని ద హిందూ అభిప్రాయపడింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు ఇలాంటి ఘర్షణపూరిత ధోరణి సరికాదని హితవు పలికింది. తనది పైచేయి అన్న ఆలోచనతో గవర్నర్ రవి మితిమీరి ప్రవర్తించడం మానుకోవడం మంచిదని సూచన చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రవి తన ప్రవర్తనను మరోసారి సమీక్షించుకోవాలని ద హిందూ సలహా ఇచ్చింది.
గవర్నర్ రవి ప్రవర్తన రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేసేలా ఉందని, అసలు రవిలో విజ్ఞత ఎక్కడ ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. గవర్నర్ తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పే వారిధిగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోయారని వ్యాఖ్యానించింది. గతంలో ఐబిలో, పోలీస్ శాఖలో పనిచేసిన రవి ఈ విషయాలను విస్మరించారని విమర్శించింది. శాసన వ్యవహారాల్లో గవర్నర్ పాత్ర చాలా పరిమితమైనదని సుప్రీంకోర్టు చెప్పిందని.. ఆ విషయాన్ని గవర్నర్ ఎందుకు గుర్తించలేకపోతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది.
గవర్నర్ రవి అతికారణంగా కేంద్రంలో బీజేపీకి భారీ నష్టమే జరుగుతుందని ఇండియన్ ఎక్ ప్రెస్స్ అభిప్రాయపడింది. రాజ్ భవన్ ప్రతిష్టను దెబ్బతీసేలా రవి వైఖరి ఉందని విమర్శించింది. రవి తీరుపై తమిళ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని వివరించింది. తమిళనాడులో పార్టీని విస్తరించాలనుకుంటున్న బీజేపీ నాయకత్వానికి రవి తీరు ఒక ఊహించని షాక్ లాంటిదేనని.. ఏ కోణంలో చూసినా ఇది తమిళనాడులో బీజేపీకి నష్టదాయకమేనని ఇండియన్ ప్రెస్ అభిప్రాయపడింది.