బీబీసీ అంటే క్రెడిబిలిటీ.. మోదీ పాత వీడియోలు వైరల్
దేశంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆకాశవాణి, దూరదర్శన్ కు ప్రజాదరణ లేదని.. భారత దేశ ప్రజలు కూడా కొత్త విషయాలను బీబీసీని చూసి తెలుసుకుంటారని, అది బీబీసీ క్రెడిబిలిటీ అన్నారు మోదీ. ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు ఎలా పనిచేయాలో బీబీసీని చూసి నేర్చుకోవాలని చెప్పారు.
గుజరాత్ అల్లర్ల వ్యవహారాన్ని చూపిస్తూ తనపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ విషయంలో ప్రధాని మోదీ ఎంత ఇదైపోతున్నారో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయన భక్తులు బీబీసీపై రగిలిపోతున్నారు. బ్యాన్ బీబీసీ అంటూ రెచ్చిపోతున్నారు. మోదీ డాక్యుమెంటరీ లింకులు సోషల్ మీడియాలో లేకుండా కేంద్ర ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవడం ఈ వ్యవహారంలో మరో హైలెట్. అయితే ఇదే మోదీ 2013లో బీబీసీని ఓ రేంజ్ లో పొగిడారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
2013లో ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యాయవాదులు, పార్టీ నేతలతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు మోదీ. ఆ టైమ్ లో ఆకాశవాణి, దూరదర్శన్, బీబీసీ అంటూ పోలిక చెప్పారు. మన దేశంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆకాశవాణి, దూరదర్శన్ కు ప్రజాదరణ లేదని.. భారత దేశ ప్రజలు కూడా కొత్త విషయాలను బీబీసీని చూసి తెలుసుకుంటారని, అది బీబీసీ క్రెడిబిలిటీ అన్నారు మోదీ. ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు ఎలా పనిచేయాలో బీబీసీని చూసి నేర్చుకోవాలని చెప్పారు. అదే మోదీకి ఇప్పుడు బీబీసీ క్రెడిబిలిటీ కనిపించడంలేదు. తనపైనే విమర్శలు ఎక్కుపెట్టే సరికి ఆ డాక్యుమెంటరీని భారత్ లో అసలు కనిపించకుండా చేయాలని తాపత్రయ పడుతున్నారు. తన శక్తియుక్తులన్నిటినీ వాడేస్తున్నారు. 2013లో మోదీకి 2023లో మోదీకి అదే తేడా అంటూ నెటిజన్లు ఇప్పుడు పాత వీడియోలను వైరల్ చేస్తున్నారు.
Back in 2013, @narendramodi used to praise the credibility of BBC
— United India (@Unitedd_India) January 24, 2023
In 2023, PM Modi has banned the #BBCDocumentary https://t.co/UwzvhUlqzy pic.twitter.com/r2SKC04Shi
మోదీకి కొత్తగోల..
మోదీ ఎంత గింజుకున్నా, ఆయన భక్తులు ఎంత ప్రయత్నించినా బీబీసీ డాక్యుమెంటరీ లింకులు మాత్రం సోషల్ మీడియానుంచి తొలగించలేకపోతున్నారు. ఎవరో ఒకరు వాటిని తిరిగి తీసుకొచ్చి అప్ లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీఎంసీ నేతలు దీన్ని ఓ మహాయజ్ఞంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మోదీ పాతవీడియో కూడా బీజేపీ నేతల్ని చికాకు పెడుతోంది. అప్పట్లో బీబీసి క్రెడిబిలిటీ గురించి మాట్లాడిన మోదీ, ఇప్పుడు అదే సంస్థపై నిందలు వేయడం కరెక్టేనా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. తమలోని లోపాలు ఎత్తి చూపితే, వీలేతే సరిదిద్దుకోవాలి, లేదంటే క్షమాపణలు చెప్పాలి.. కానీ ఇలా మీడియాని నియంత్రించాలనుకోవడం సరికాదంటున్నారు. మొత్తమ్మీద కొత్త డాక్యుమెంటరీతోపాటు, పాత వీడియోలు కూడా ఇప్పుడు మోదీ క్రెడిబిలిటీని ప్రశ్నిస్తున్నాయి.