Telugu Global
National

ఈయన 'కుత్తా' కాదు 'దత్తా' అందుకే ఇలా మొరుగుతున్నాడు

పశ్చిమబెంగాల్, బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో శ్రీకాంతి దత్తా అనే వ్యక్తి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడు. కొంత కాలానికి అతనికి అధికారులు రేషన్ కార్డు సాంక్షెన్ చేశారు. అయితే ఆ రేషన్ కార్డులో అతని పేరు శ్రీకాంతి దత్తా బదులు శ్రీకాంతి కుత్తా అని పడింది.

ఈయన కుత్తా కాదు దత్తా అందుకే ఇలా మొరుగుతున్నాడు
X

తమకు జరిగిన అన్యాయం పట్ల ఒక్కొక్కరి స్పందన ఒకలా ఉంటుంది. అలాగే ఒక్కొక్కరి నిరసన తెలిపే పద్దతి ఒకలా ఉంటుంది. కొందరు ధర్నాలు చేస్తారు, కొందరు నిరహార ధీక్షలు చేస్తారు. కొందరు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తారు. ఎవరి పద్దతి వాళ్ళది కానీ పశ్చిమ బెంగాల్ లో ఓ వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై కుక్కలా మొరుగుతూ నిరసన తెలిపాడు. అయితే ఆయనకు జరిగిన అన్యాయానికి, ఆయన అరిచిన కుక్క అరుపులకు ఓ లింకుంది. అదేంటో తెలుసుకోవాలంటే కింది కథనం చదవండి...

పశ్చిమబెంగాల్, బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో శ్రీకాంతి దత్తా అనే వ్యక్తి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడు. కొంత కాలానికి అతనికి అధికారులు రేషన్ కార్డు సాంక్షెన్ చేశారు. అయితే ఆ రేషన్ కార్డులో అతని పేరు తప్పు పడింది ఆ పేరును సరి చేయాలంటూ ఆయన ఆఫీసుల చుట్టూ తిరగగా ఆయన పేరును మార్చి మరో రేషన్ కార్డు ఇచ్చారు. మార్చిన పేరు మరీ అన్యాయంగా ఉంది. శ్రీకాంతి దత్తా బదులు శ్రీకాంతి కుత్తా అని పడింది. కుత్తా అంటే కుక్క అని మీకు తెలుసు కదా !

అధికారులు చేసిన ఈ పనికి ఆయనకు పట్టరాని కోపమొచ్చింది. రేషన్ కార్డులో పేరు మార్చాలంటూ మళ్ళీ కింది కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం దాకా చెప్పులరిగేలా తిరిగాడు. అనేక అప్లికేషన్లు ఇచ్చాడు. ఎక్కడా ఆయన పని జరగలేదు పైగా హేళనలు ఎదురయ్యాయి.

తాజాగా మళ్ళీ ఆయన తన పేరును సరి చేయాలంటూ బంకూరాలోని జాయింట్ BDO కార్యాలయానికి వెళ్ళాడు. కార్యాలయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న ఓ అధికారి కారుకు అడ్డంపడ్డాడు. కుక్కలా బౌ బౌ అని మొరుగుతూ అధికారిపైకి తన అప్లికేషన్ పేపర్లు, తన అసలు పేరు ప్రూఫ్ ల డాక్యుమెంట్లు తోసేశాడు. రోడ్డుపై కదులుతున్న కారు వెంట పరుగెత్తుతూ, కుక్కలా మొరుగుతూ, కారు కిటికీలోంచి కాగితాల కుప్పను అధికారిపైకి తోస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"రేషన్ కార్డులో నా పేరు దిద్దుబాటు కోసం మూడుసార్లు దరఖాస్తు చేశాను. మూడోసారి నా పేరు శ్రీకాంతి దత్తా అని కాకుండా శ్రీ కాంతి కుత్తా అని రాశారు. దీంతో నేను మానసికంగా ఇబ్బంది పడ్డాను'' అని మీడియాతో అన్నారు. అందుకే నిరసనగా ఆ అధికారి ముందు కుక్కలా అరిచానని దత్తా చెప్పారు. అయితే, అధికారి స్పందించకుండా పారిపోయాడని అతను చెప్పాడు.

ఇది కొందరికి కామెడీలాగా అనిపించవచ్చు కానీ శ్రీ కాంతి దత్తా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రజల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రజలకు సంబంధించిన పనులను తూతూ మంత్రం లాగా చేసే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎప్పటికి మారేనో ?

First Published:  21 Nov 2022 11:16 AM IST
Next Story